పలువురు స్టార్ హీరోల సినిమాలు పాన్ ఇండియా కేటగిరిలో విడుదలవుతున్న కారణంగా.. బాలీవుడ్ మార్కెట్ కోసం .. ఈ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు మేకర్స్ . నిజంగా ఇది మంచి పరిణామమే. ప్రస్తుతం టాలీవుడ్.. కొందరు మలయాళ, కన్నడ ముద్దుగుమ్మల అందాలతో నిండిపోయి ఉంది. వారంతా బాలీవుడ్ బ్యూటీస్ కు అంతపోటీ కాకపోయినా.. అందం, అభినయంలో వారికి ఏమాత్రం తీసిపోరు. అయినా సరే పాన్ ఇండియా మూవీస్ కోసం.. బాలీవుడ్ అందాలు ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ లో గుబాళించ బోతున్నాయి.
మెగాస్టార్ సరసన దబాంగ్ బ్యూటీ
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత చిరు.. ‘లూసిఫర్’ మలయాళ రీమేక్ కోసం రెడీ అవుతారు. ఈ సినిమాను తెరకెక్కించే బాధ్యతను చిరంజీవి వివి వినాయక్ కు అప్పగించగా.. ఆయన స్ర్కిప్ట్ ను లాక్ చేసే పనిలో ఉన్నాడట. తెలుగు నేటివిటీకి, చిరంజీవి ఇమేజ్ కు తగ్గరీతిలో వినాయక్ స్ర్కిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తున్నాడట. దాని ప్రకారం ఇందులో చిరంజీవికి హీరోయిన్ , ఆమెతో ఒకపాట కూడా ఉండబోతోందట. అది కూడా సినిమాలో ఆ పాత్ర కొద్ది నిమిషాలే ఉంటుందట. ఆ పాత్ర కోసం వినాయక్ బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను సంప్రదించాడట. సోనాక్షి కూడా చిరు సరసన నటించడానికి ఓకే చెప్పిందట. ఆల్రెడీ అమ్మడు రజనీకాంత్ సరసన ‘లింగ’లో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకి సోనాక్షి ప్రధాన ఆకర్షణ కాబోతోంది.
ప్రభాస్ తో దీపికా పదుకొణే
మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ .. ప్రభాస్ కథానాయకుడిగా ఒక మహా సినిమా తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 500కోట్ల బడ్జెట్ తో నిర్మాణం జరుపుకోనున్న ఈ సోషియో ఫాంటసీ సినిమా పాన్ ఇండియా కేటగిరిలో బహుభాషల్లో విడుదల కాబోతోంది. అందుకే ఆ రేంజ్ కు తగ్గ కథానాయికను ఈ సినిమాకోసం ఎంపిక చేశాడు దర్శకుడు. ఇందులో డార్లింగ్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణేను కథానాయికగా ఖాయం చేశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం జరుపుకోనుంది. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తికాగానే… నాగ్ అశ్విన్ సినిమా కు రెడీ అవుతాడు ప్రభాస్. ఆల్రెడీ బాహుబలి, సాహోతో బాలీవుడ్ ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్న, ప్రభాస్ ఇప్పుడు దీపికాతో ఆడిపాడనుండడం ఆసక్తిరేపుతోంది.
‘సర్కారు వారి పాట’ లో విద్యాబాలన్
సూపర్ స్టార్ మహేశ్ బాబు, పరశురామ్ కలయికలో తెరకెక్కనున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘సర్కారు వారి పాట’ . బ్యాంకింగ్ స్కామ్ కుంభకోణం నేపథ్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా .. పాన్ ఇండియా కేటగిరిలో నిర్మాణం జరుపుకోబోతోంది ఈ సినిమా. త్వరలోనే యూ.యస్.ఏ లోని డెట్రాయిట్ సిటీలో మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుపుకోనుందట. 45 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందట. అయితే ఇందులోని ఒక ప్రధాన పాత్రకోసం బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ ను సంప్రదించాడట దర్శకుడు. విద్యాబాలన్ కూడా ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపుతోందట. ఇప్పటికే ఈ సినిమాలో విలన్ పాత్రకి అనిల్ కపూర్ ను ఎంపికచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విద్యా కూడా నటించబోతుండడం .. టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఎర్లియర్ గా ‘యన్టీఆర్’ బయోపిక్ లో బసవతారకం పాత్రను పోషించిన విద్యా బాలన్.. మంచి పేరు తెచ్చుకుంది.
రామ్ చరణ్ తో మళ్ళీ కియారా
రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తో పాటు మనోడు ఇప్పుడు మరో సినిమాలో కూడా సైమల్ టేనియస్ గా నటించేందుకు సిద్ధమవుతున్నాడు. చిరంజీవి, కొరటాల ‘ఆచార్య’ సినిమాకి చరణ్ ఒన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ అన్నసంగతి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించబోతున్నట్టు ఎప్పటి నుంచో అనుకుంటున్నదే. ఈ మధ్యే ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. ఇందులో 30 నిమిషాల పాటు కనిపించనున్న చెర్రీ కనిపించనున్నాడు. ఆసక్తికరమైన ఆ ఎపిసోడ్ లో అతడి సరసన కియారా అద్వానీ నటించబోతోందట. ఆల్రెడీ చరణ్ తో కియారా ‘వినయ విధేయ రామ’లో నటించిన సంగతి తెలిసిందే. రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా ఈ ఇద్దరి జోడీకి మంచి పేరొచ్చింది. మరి ఈ బాలీవుడ్ బ్యూటీస్ ఏ రేంజ్ లో పేరు తెచ్చుకుంటారో చూడాలి.











