ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా తీసుకున్న నిర్ణయం విమర్శలకు గురయింది. తమ పార్టీ నాయకులపై ఉన్న కేసులను విత్ డ్రా చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రతినిధులపై కేసులను వేగవంతంగా దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టుకి అమికస్ క్యూరీ సూచనలు చేశారు. ఈ సూచనలపై తమ విధానం చెప్పాలని కేంద్రాన్ని సుప్రీం అడిగింది. ఈ నేపథ్యంలో జగన్ తమ పార్టీ నాయకులపై ఉన్న కేసులను ఎత్తివేస్తూ జీవోలను విడుదల చేసింది. జగన్ సర్కార్ ఎత్తివేసిన కేసుల జాబితాలో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఉన్నారు.
అప్పుడు అలా…ఇప్పుడు ఇలా
గత టీడీపీ ప్రభుత్వంలో వీరిపై అక్రమంగా కేసులు పెట్టారని అందుకే ఈ కేసులను విత్ డ్రా చేసినట్లు వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నమోదయిన కేసులను అధికారంలోకి రాగానే కొట్టివేసిన వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. 2017లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే టీడీపీ నాయకులపై ఉన్న కేసులను అప్పటి ప్రభుత్వం విత్ డ్రా చేసిందని కోర్టుకు వెళ్లారు. దీంతో హైకోర్టు గత ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అప్పుడు చంద్రబాబు నాయుడు చేసింది తప్పని కోర్టుకెక్కిన వైసీపీ ప్రస్తుతం చేసిన పని ఏంటనే చర్చ జరిగింది.
ఎవ్వరున్నా అదే దారి
అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు. తమ పార్టీకి చెందిన నాయకులపై ఉండే కేసులను ఎత్తివేయడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు 251 మంది పాార్టీ నాయకులపై కేసులు ఎత్తేసింది. వారిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు.
ఏ ప్రభుత్వంలో జరిగినా తప్పు తప్పే. కానీ ప్రతిపక్షంలో ఉంటే ఒకలా అధికారంలో ఉంటే ఒకలా వ్యవహరించరాదనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎత్తివేసిన కేసులు ఏ మేరకు తీవ్రమైనవి లేక పెట్టుడు కేసులా అనేవి కోర్టులు తేల్చాలి కానీ మన నాయకులకు మనమే క్లీన్ చీట్ ఇచ్చుకోకూడదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ వరుస జీవోలు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శలకు గురి చేసింది.











