బాలీవుడ్ సూపర్ స్టార్ అనిల్ కపూర్ మరోసారి తెలుగు తెరపై కనువిందు చేయనున్నారా ? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ సర్కిల్స్. బాపు దర్శకత్వంలో వచ్చిన వంశవృక్షం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనిల్ కపూర్ దాదాపు దశాబ్దాల తరువాత మళ్ళీ తెలుగు తెరపై కనిపించనున్నారు అనే వార్తలు సినీ వర్గాలలో బలంగా వినిపిస్తున్నాయి. అదీ ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రిగా నటించబోతున్నారట. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో త్వరలో తెరకెక్కనున్న చిత్రంలో అనిల్ కపూర్ మహేష్ తండ్రి పాత్ర పోషించబోతున్నారనే ప్రచారం తెగ చెక్కర్లు కొడుతోంది.తొలత ఈ పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని అనుకున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ స్థానంలో అనిల్ కపూర్ పేరు వినిపిస్తోంది. ఇక యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోందట.ఈ మూవీ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ముందుగా మహేశ్ పై ఓ సోలో సాంగ్ , అలాగే ఒక ఫైట్ ను కూడా చిత్రీకరించబోతున్నారని టాక్. ఆ తర్వాత చిత్రీకరిచబోయే లాంగ్ షెడ్యూల్ లో అనిల్ కపూర్ కూడా ఉండబోతున్నారని వినికిడి.
కాగా ప్రస్తుతం మహేశ్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మే 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ థియేటర్స్ లో విడుదల కానుంది.ఆ తర్వాత మహేశ్, త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మళ్ళీ మహేశ్, త్రివిక్రమ్ కలయికలో ఈ సినిమా రూపొందనుండడంతో, సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహర్షి, సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత మహేశ్ బాబు, అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్స్ తర్వాత త్రివిక్రమ్.. ఇరువురి కలయికలో రాబోతున్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మరి ఇందులో నిజంగానే అనిల్ కపూర్ నటిస్తున్నారో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.