నెల్లూరు కోర్టులో చోరీ కేసులో తెరపైకి వచ్చిన కొత్త ట్విస్ట్ ఏమిటి ? చోరీ కేసులో నిజంగా రాజకీయ కోణం లేదా ? పట్టుబడ్డ నిందితులు పాత నేరస్తులే అని పోలీసుల చెబుతున్నది నిజమేనా ? ఫోర్జరీ కేసులో సమాధానాలు దొరకని సందేహాలు ఏంటి ?
నెల్లూరు కోర్టులో ఫైల్స్ చోరీ ఘటనలో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు వారిని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేదని, నిందితులు పాత నేరస్తులే అని, గతంలో వీరిపై అనేక చోరీ కేసులు నమోదై ఉన్నాయి అని పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసుల కధనం పై అనేక సందేహాలు తలెత్తుతుండగా వాటికి సమాధానం దొరకడం లేదట.
మంత్రి కాకాని ప్రధాన నిందితుడిగా ఉన్న కేసులో కీలక ఆధారాలు అపరహరణ గురికావడం పెద్ద సంచలనంగా మారింది. ఇక పోలీసుల తీరుపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కేసులో పురోగతి సాధించాం అంటూ పోలీసులు అకస్మాత్తుగా మీడియా ముందుకు వచ్చారు. చోరీ కేసులో సయ్యద్ హయ్యత్, ఎస్‌కే రసూల్ అలియాస్ మస్తాన్ అనే ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశామని వారినీ మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు.
నిందితులు కోర్టు ప్రాంగణంలో ఉన్న ఇనుప స్ర్కాప్‌ను దొంగతనం చేసేందుకు కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించినట్లు తమ విచారణలో అంగీకరించారని.. ఆ సమయంలో అక్కడే ఉన్న కుక్కలు మొరగడంతో నిందితులు కోర్టులోని ఒకటవ అంతస్థులోకి ప్రవేశించి బీరువా తాళాన్ని పగులగొట్టి అందులోని బ్యాగులో విలువైన వస్తువులు ఉంటాయని దొంగతనం చేశారనేది పోలీసుల కధనం.ఇక చోరీ పై ఔట్‌సోర్సింగ్ క్లర్క్ బచ్చలకూరి నాగేశ్వరరావు ఫిర్యాదు చేయడంతో సిసి కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేశామని, వారు పాత నెరస్థులుగా కూడా గుర్తించామని జిల్లా ఎస్పీ విజయ రామారావు తెలిపారు.అంతేకాకుండా పట్టుబడిన నిందితుల్లో ఒకరిపై 14 కేసులు ఉండగా అతడు చాలా కాలం జైలు జీవితం అనుభవించి వచ్చాడని పోలీసులు అందించిన సమాచారం.
కాగా పోలీసులు చెబుతున్న కధనం పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట.పధ్నాలుగు కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఓ దొంగ కోర్టులో దొంగతనం చేసేందుకు వెళ్తాడా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయట. అదేసమయంలో వెళ్ళినదే ఇద్దరు వ్యక్తులు ఎంత ఇనుము అపహరించగలరు, అదీ కాకుండా నెల్లూరు నడి బొడ్డున అనేక భవనాలు నిర్మాణం జరుగుతుంటే వాటిని వదిలేసి వీరు కోర్టులోనే దొంగతనం చేయడానికి ప్రయత్నించారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయట.ఇక కుక్కలు మొరిగితే వారు కోర్టులోకి ప్రవేశించారు అనే అంశం పైనా కొందరు వ్యంగ్యంగా చర్చించుకుంటున్నారట.నిందితులు ఆత్మకూరు బస్టాండు ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద జీవనం సాగిస్తున్నారని పోలీసులే చెబుతున్నారు.. అలాంటి వారు కుక్కలు మొరిగితే భయపడి కోర్టులోని ఒకటవ అంతస్థులోకి ప్రవేశించారు అని చెప్పడం వెనుక ఔచిత్యం ఎక్కడుందని బహిరంగంగానే చర్చించుకుంటున్నారట.అదీ నిజమే అనుకున్నా..బ్యాగు చేతికి అందిన వెంటనే అందులో ఏమున్నాయో చూసి వస్తువులు తీసుకొని పరారవచ్చుగా? తమకు దొరికిన ఎలక్ర్టానిక్ వస్తువులను మార్కెట్‌లో విక్రయించేందుకు ఎందుకు ప్రయత్నించలేదు? అంటూ చెవులు కోరుక్కుంటున్నారట.
ఇదిలా ఉంటే దీని వెనుక రాజకీయ కోణం లేదు అని పోలీసులు చెబుతున్నా ఖచ్చితంగా రాజకీయ కుట్రలో భాగమే ఈ చోరీ అనే వాదన జోరుగా సాగుతోందట. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నందున ఆయనే ఈ చోరీకి ప్రేరేపించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. కేవలం తన రాజకీయ భవిష్యత్తుకు విఘాతం కాలగకూడదు అనే ఆలోచనతో ఆయనే సాక్ష్యాలు మాయం చేసేందుకు ప్రయత్నించి ఉంటారని టాక్. అందులో భాగంగానే నిందితులను అపహరణకు ఉసిగొల్పి ఉంటారని, ఎలాగూ తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారుకాబట్టి, తాను మంత్రి అయ్యాక నిందితులను కేసులో నుంచి బయట పడేస్తా అని హామీ ఇవ్వడంతో పాటు భారీగా సొమ్ము ముత్త చెప్పి ఉంటారని, అందుకే వారు ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారనే చర్చ స్థానికంగా నెలకొందట.అయితే ఇవన్నీ సందేహాలు అయినప్పటికీ ఎవరో ఇద్దరు పాత నెరస్థులను తెచ్చి వీరే దొంగలు పోలీసులు నిర్ధారించడం వెనుక రాజకీయ ప్రమేయం బలంగా ఉండిఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. ఈ క్రమంలోనే పోలీసులు నిందితులను పట్టుకున్నామంటూ ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ సందేహాలను నివృత్తి చేయకపోవడం చూస్తుంటే ఇది రాజకీయ కుట్ర కోణంలో భాగమే అని దీని వెనుక పోలీసులపై ప్రస్తుత మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఒత్తిడి ఖచ్చితంగా ఉండి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారట.
మొత్తం మీద కోర్టులో చోరీ కేసులో నిందితులను పట్టేసుకున్నాం అని పోలీసులు చెబుతున్నప్పటికీ సమాధానం దొరకని సవాలక్ష సందేహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందని పరిశీలకులు భావిస్తున్నారట.