షర్మిల ఏపీ రాజకీయాల్లో వస్తారని ప్రచారం మొదలైనప్పటి నుంచి ఏపీ రాజకీయాల్లో చాలా ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. తాజాగా షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవిని కలిశారు. సాధారణంగా కలిసినా అంత హైలెట్ అవ్వదు కానీ.. వారు కలిసిన సందర్భంగా దిగిన ఫోటోను కావాలనే బయటికి రిలీజ్ చేశారు. దీంతో అసలు కడప జిల్లాలో ఏం జరగబోతోంది.. అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఏపీ రాజకీయాల్లోకి రారు అనుకున్న వైఎస్ షర్మిల అందుకు అంగీకరించడం.. కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. షర్మిల ఏపీకి వచ్చి కాంగ్రెస్‌లో రాజకీయం చేస్తే జగన్ పరిస్థితి తారుమారు అవుతుందని.. ముఖ్యంగా కడప జిల్లాలో షర్మిల, సునీత కలిసి రాజకీయం చేస్తారని అంచనాలు ఉన్నాయి.
వైసీపీకి దూరం అయిన నేతలు షర్మిల వెంట నడుస్తున్నారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలతో కలిసి కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటించారు. అయితే షర్మిల చేరికకు ముందే టీడీపీ నేత బీటెక్ రవితో బ్రదర్ అనిల్‌కుమార్ ఉన్న ఫోటో వైరల్ అయింది. బీటెక్ రవి వైఎస్ కుటుంబంపై పులివెందుల నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి. ఇలా పులివెందులలో జగన్ మోహన్ రెడ్డి ప్రత్యర్థితో బ్రదర్ అనిల్ కుమార్ సమావేశం కావడం ప్రాధాన్యం కలిగించింది. అయితే, ఈ సందర్భంగా బ్రదర్ అనిల్ కుమార్ తన బావ జగన్ మోహన్ రెడ్డి టాప్ సీక్రెట్స్ అన్ని బీటెక్ రవితో పంచుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అసలు తమను జగన్ ఎలా అన్యాయం చేశారనే వివరాలను బ్రదర్ అనిల్ కుమార్ బీటెక్ రవితో పంచుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా బ్రదర్ అనిల్ కుమార్ భావోద్వేగానికి లోనైనట్లుగా కూడా చెబుతున్నారు.
ఆ తర్వాత బీటెక్ రవి మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాలపై షర్మిలకు అసలు ఆసక్తి లేదని.. తన అన్న జగన్ ఇబ్బందులు పెట్టడం వల్లే ఆమె ఏపీలోకి వస్తున్నారని బీటెక్ రవి చెప్పారు. అయితే, తన సొంత అన్న సీఎంగా ఉన్న సమయంలో ఏపీ రాజకీయాల్లోకి వస్తే బాగుండదనే ఉద్దేశంతో ఇన్ని రోజులూ షర్మిల మౌనంగా ఉన్నారన్న విషయాన్ని బ్రదర్ అనిల్ కుమార్ తనతో పంచుకున్నట్లు బీటెక్ రవి వెల్లడించారు. గతి లేని పరిస్థితుల్లో తాము ఏపీ రాజకీయాల్లోకి రావాల్సి వస్తోందని అనిల్‌కుమార్ తనతో చెప్పినట్లు బీటెక్ రవి మీడియాతో చెప్పారు.
తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి పత్రికను అన్న జగన్‌కు ఇచ్చి పెళ్లికి పిలవడానికి షర్మిల ప్రత్యేక విమానంలో కడప నుంచి విజయవాడ వెళ్లగా.. ఆ చిన్న విమానంలో సీట్లు సరిపోకపోవడంతో బ్రదర్ అనిల్ కుమార్.. మరో విమానంలో విజయవాడకు వెళ్లాల్సి వచ్చింది. అదే విమానంలో బీటెక్ రవి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తమ మధ్య చాలా చర్చలు జరిగినట్లుగా బీటెక్ రవి మీడియాకు చెప్పారు. షర్మిలకు కాంగ్రెస్ అధిష్ఠానం పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తుందా? లేక సీడబ్ల్యూసీ సభ్యురాలిగా నియమిస్తుందా? అనే విషయంలో స్పష్టత లేదని బీటెక్ రవి చెప్పారు. పీసీసీ అధ్యక్ష పదవిని వస్తే ఏపీ రాజకీయాలు ఎలా ఉంటాయనే విషయంలో తాము మాట్లాడుకున్నామని బీటెక్ రవి చెప్పారు. కడప రాజకీయాలపై బ్రదర్ అనిల్ కుమార్ తన అభిప్రాయాలను చెప్పారని.. కొన్ని కీలక సూచనలు చేసినట్లుగా కూడా బీటెక్ రవి వివరించారు. దీంతో బ్రదర్ అనిల్ కుమార్ జగన్ కు సంబంధించి కీలక వివరాలను లీక్ చేశారనే ప్రచారం జరుగుతోంది