వైసీపీ అగ్ర నేత జగన్ ను ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండేవారిలో విజయసాయి రెడ్డి ముందుంటారు. ఇద్దరికి వివిధ కుంభకోణాల్లో, కేసుల్లో పార్టనర్ షిప్ ఉంటుందని ఎద్దేవా చేస్తుంటారు. అందుకే జగన్ అక్రమాస్తుల కేసుల్లో విజయసాయి రెడ్డి కూడా ఓ నిందితుడిగా ఉన్నారు. అలాంటి జగన్ దగ్గరి మనిషికి చెందిన సొంత బావ మరిదే కడప జిల్లాలో టీడీపీలో చేరడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. విజయసాయి సొంత బావమరిది ద్వారకానాథ్ రెడ్డి వైసీపీపై అసమ్మతితో తన బావ చెప్పినా వినకుండా పసుపు కండువా కప్పుకున్నారు. అయితే, ఆయన సైలెంట్ గా వెళ్లకుండా అధికార పార్టీపై చేస్తున్న వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశం అవుతున్నాయి.
ఈసారి కడపలో 6 లేదా 7 సీట్లు పక్కాగా తెలుగు దేశం పార్టీ గెలుస్తుందని ద్వారకానాథ్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలే కడప జిల్లాల్లో వైసీపీ మరింత ఉసూరుమనేలా చేస్తోంది. ఇప్పటికే జగన్ అధికారంలోకి వచ్చాక తమకు ఏమీ చేయలేదన్న అసహనంతో ఉన్న కార్యకర్తల్లో.. ఉన్న కాస్త జోష్ కూడా తగ్గిపోతోంది. కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉండగా.. జిల్లా పరంగా చూస్తే 10 నియోజకవర్గాలు ఉన్నాయి. కడప, పులివెందుల, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, కోడూరు, బద్వేల్, రాజంపేట, కమలాపురం స్థానాలు ఉన్నాయి. వీటిలో 6 లేదా 7 సీట్లు టీడీపీనే గెలిస్తే.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ద్వారకానాథ్ రెడ్డి వైసీపీ కోసం గత నాలుగు ఎన్నికల్లో పనిచేశారు. ప్రతిసారి టికెట్ ఆశించినప్పటికీ జగన్ ఆయన్ను దూరం పెడుతూ వచ్చారు. పైగా బావ విజయసాయి రెడ్డి కూడా అంతగా పట్టించుకోలేదు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏదైనా పోస్టు దక్కుతుందనుకుంటే అక్కడ కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నానని ఆయనే ఇటీవల చెప్పుకున్నారు. కనీసం తనను సీఎం పేషీలోకి కూడా అడుగు పెట్టనీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా మూడు విషయాల్లో జగన్ ప్రజాదరణ కోల్పోయారని.. రాష్ట్రంలో అవినీతి భయంకరంగా పెరిగిపోవడం.. ఇదేమిటని ప్రశ్నిస్తే అణిచివేతను ఆయుధంగా వాడడం చేస్తున్నారని అన్నారు. వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు. జగన్ ఎవరినీ కలవడని.. ఎవరికీ చిక్కకుండానే.. నేతలను ఎన్నికల్లో వాడుకుని.. తర్వాత పారేయడం ఆయనకు అలవాటని ద్వారకానాథ్ రెడ్డి అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, పీవీ మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి లాంటివారు ఆయనకు డబ్బులు వసూలు చేసి పెట్టే ఏజెంట్లలా ఉంటారని ఆరోపణ చేశారు. వీరు సీఎం పేషీలో మాత్రమే ఉంటారని.. వీరి మాటలు వింటూ మళ్లీ గెలుస్తానని జగన్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈసారి జగన్ గెలవడం కల్ల అని.. ఘోరంగా ఓడిపోతారని ద్వారకానాథ్ రెడ్డి అన్నారు. పైగా రాబోయే కాలంలో విజయసాయి రెడ్డి కూడా టీడీపీలోకి వచ్చినా ఆశ్చర్యం లేదని మరో చర్చనీయాంశం లేవనెత్తారు.











