మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజినిని వివాదాలు విడిచిపెట్టడం లేదు. ఒక ఇష్యూ నుంచి తేరుకునేలోపే ఆమె మరో సమస్యలో చిక్కుకుంటున్నారు. ఇప్పుడు విడదల రజినీ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. ఐ-టీడీపీ కార్యకర్తలను వేధించిన కేసులో విడదల రజినీపై కేసు పెట్టాలని హైకోర్టు పల్నాడు జిల్లా పోలీసులను ఆదేశించింది. ఐ – టీడీపీ కార్యకర్తను పోలీసులతో కొట్టించి లైవ్‌లో చూశారని రజినీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే ఇష్యూలో ఇప్పుడు ఆమెపై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
విడదల రజినీ బయటకు కనిపించే పొలిటికల్ నాయకురాలు కాదన్న మాట వినిపిస్తోంది. డబ్బులతో రాజకీయాల్లోకి వచ్చి..డబ్బు సంపాదించుకునేందుకే రాజకీయాలు చేస్తారని చిలకలూరిపేట ప్రజలు చర్చించుకుంటున్నారు. కేవలం సోషల్‌మీడియాలో ప్రశ్నించారని టీడీపీ కార్యకర్తలను పోలీసులతో కొట్టించి..లైవ్‌లో చూశారు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ రఘురామను జైలులో వేధించినప్పుడు అప్పటి సీఎం జగన్ ఇదే తరహాలో లైవ్‌లో చూశారు.
ఐతే ఇప్పుడు పరిస్థితి మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఐ – టీడీపీ కార్యకర్తలు న్యాయపోరాటానికి దిగారు. మాజీ మంత్రి విడదల రజినీపై ఎట్టకేలకు కేసు పెట్టించారు. ఐతే పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఐతే రజినీ అక్రమాలు అన్నీఇన్ని కావు. ఓ స్టోన్ క్రషర్ యజమాని దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేశారని విజిలెన్స్ తేలింది. కానీ కేసులు పెట్టలేదు. భూములు ఆక్రమించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ ఆమెపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవలి ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసిన విడదల రజినీ అక్కడ ఘోరంగా ఓడిపోయారు. దీంతో మళ్లీ చిలకలూరిపేటలోనే రాజకీయాలు చేస్తున్నారు. ఐతే మంత్రిగా ఉన్న టైంలో చేసిన దారుణాలు విడదల రజినీని వెంటాడుతూనే ఉన్నాయి.
ఎన్నికల ముందు చిలకలూరిపేట టికెట్ ఇప్పిస్తానని అప్పటి వైసీపీ ఇన్‌చార్జి మల్లుల రాజేశ్ నాయుడు నుంచి రజినీ దాదాపు 6 కోట్లు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశంపై రాజేశ్ నాయుడు ఆందోళనకు దిగారు. ఇలా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు విడదల రజినీ. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో విడదలపై కేసు నమోదు విషయంలో పోలీసుల ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 8 నెలలు గడుస్తున్నా వైసీపీ హయాంలో తమను వేధించిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని కార్యకర్తలు ఆవేదనలో ఉన్నాయి. ఐతే చంద్రబాబు మాత్రం ప్రతీకార రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.