విజయసాయిరెడ్డి జగన్‌కు అత్యంత సన్నిహితుడు. కష్ట,సుఖాల్లో ఆయన వెంట నడిచినవాడు. కేసుల్లోనూ పాలు పంచుకున్నవాడు. కానీ ఉన్నట్టుండి ఇటీవల వైసీపీకి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవిని మూడేళ్ల ముందుగానే రాజీనామా చేసి జగన్‌కు బిగ్‌షాక్ ఇచ్చాడు విజయసాయి. ఐతే రాజీనామా సమయంలో తన రాజీనామాకు ఎలాంటి ఒత్తిళ్లు లేవని, వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నానని చెప్పాడు విజయసాయి. కానీ విజయసాయి రాజీనామాకు కారణమేంటన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. పార్టీలో గుర్తింపు లేని కారణంగా రాజీనామా చేశారన్న ప్రచారం ఒకవైపు..కాకినాడ్ పోర్టు విషయంలోనే ఈడీ,సీబీఐలకు భయపడి రాజీనామా చేశారన్న ప్రచారం మరోవైపు జరుగుతోంది.
నిన్నటివరకూ విజయసాయి రాజీనామాపై జగన్ స్పందించలేదు. కానీ గురువారం నాడు ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన జగన్ విజయసాయిరెడ్డి పేరు తీసి మరీ మాట్లాడారు. వ్యక్తిత్వం, విశ్వాసం అనేవి రాజకీయాల్లో చాలా ముఖ్యమని వైఎస్ జగన్ తెలిపారు. ప్రలోభాలకు లొంగి.. లేదంటే భయపడి.. వ్యక్తిత్వం తగ్గించుకుంటే ఎలా అని ప్రశ్నించారు జగన్. అయితే ఇది ఒక్క విజయసాయిరెడ్డికి మాత్రమే కాదని.. అధికారం పోయిన తర్వాత గత కొన్ని నెలలుగా పార్టీ నుంచి వెళ్లిపోయిన అందరికీ ఇదే వర్తిస్తుందని జగన్ స్పష్టం చేశారు. ఇంకా ఒకరో.. ఇద్దరో వైసీపీ నుంచి వెళ్లిపోయే వాళ్లు ఉంటే వాళ్లకైనా ఇదే వర్తిస్తుందని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. వైసీపీ పార్టీ ఇవాళ.. ఉంది అంటే అది నాయకుల వల్ల కాదని చెప్పారు.
తాజాగా జగన్ వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్ ఇచ్చారు విజయసాయి. జగన్ వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి..వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదంటూ జగన్‌కు రిప్లై ఇచ్చారు. భయం అనేది తనలో ఏ అణువు,అణువులోనూ లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవులను, రాజకీయాలను కూడా వదిలేసుకున్నానని సమాధానమిచ్చారు.
విజయసాయి రెడ్డి ట్వీట్‌తో జగన్, విజయసాయి రెడ్డి మధ్య విబేధాలు పీక్ స్టేజ్‌కు చేరాయని అర్థమవుతోంది. ఇన్నాళ్లూ గుట్టుగా ఉన్న విబేధాలు విజయసాయి ట్వీట్‌తో రచ్చకెక్కాయి. జగన్‌తో విబేధాల కారణంగానే విజయసాయి వైసీపీకి గుడ్‌బై చెప్పినట్లు స్పష్టమవుతోంది. జగన్ వైఖరి కారణంగా సొంత చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మ దూరంగా ఉంటున్నారు. ఇన్నాళ్లూ అండగా ఉన్న విజయసాయి ఇప్పుడు జగన్‌కు దూరమయ్యారు.