మూడు రాజధానుల అంశంలో కేంద్రం మరింత స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు ఏపీ హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ విభజన చట్టం ప్రకారం మూడు రాజధానుల ఏర్పాటులో తప్పు లేదని హోంశాఖ తమ అఫిడవిట్ లో పేర్కొంది. విభజన చట్టం ప్రకారం ఎక్కడా ఏపీకి ఒకే రాజధాని ఉండాలని లేదని స్పష్టం చేసింది. అమరావతిని రాజధానిగా కేంద్రం ఒప్పుకోని ఆర్థిక సాయం చేసిందని సాంబశివరావు అనే వ్యక్తి వేసిన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్న హైకోర్టుకు కేంద్రం హోంశాఖ ఈ అఫిడవిట్ సమర్పించింది. 2018లో అప్పటి ప్రభుత్వం అమరావతిలో హైకోర్ట్ ను ఏర్పాటు చేసిందని గుర్తు చేసిన హోంశాఖ న్యాయవ్యవస్థలు ఏర్పాటు చేసినంత మాత్రాన అమరావతే రాజధాని అని చెప్పడానికి వీలు కాదని కీలక వ్యాఖ్యలు చేసింది.
సెక్షన్ 13 ప్రకారం రాజధాని అంటే ఒకటే ఉండాలనే అర్ధం కాదని వివరణ ఇచ్చింది. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని కేంద్రం జోక్యం చేసుకోదని మరోమారు స్పష్టత ఇచ్చింది. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశమే లేదని కేంద్రం చెప్పుకొచ్చింది. రాజధానికి ఆర్థిక సాయం మాత్రమే చేస్తామని కేంద్రం మరోమారు స్పష్టం చేయడంతో అమరావతి ప్రాంతవాసుల ఆశలపై నీళ్ళు చల్లినట్లయింది. బీజేపీ అవకాశ వాద రాజకీయాలకు ఇది ఒక పెద్ద నిదర్శమని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
అమరావతిని రాజధానిగా కేంద్రం ఒప్పుకొని టీడీపీ ప్రభుత్వంలో నిధులని ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు రిలీజ్ చేసిన జీవోలలో కూడా రాజధానికి నిధులు అంటూ స్పష్టంగా తెలిపారు. కానీ ఇప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్ లో మాత్రం నిధులు ఇస్తే రాజధానిగా ఒప్పుకున్నట్లు కాదని చెప్పడం చూస్తుంటే బీజేపీ ద్వంద ప్రమాణాలు పాటిస్తోందనే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. రాష్ట్ర బీజేపీ నాయకత్వం అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తుండగా కేంద్ర నాయకత్వం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమంటూ చెప్పడం దారుణమని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ తో మూడు రాజధానుల విషయంలో స్టేటస్ కోని హైకోర్టు ఎత్తేసే ప్రమాదం ఉందని అమరావతి ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు.