మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్న మిర్చి రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. మిర్చి రైతులను ఆదుకోవాలంటూ సీఎం చంద్రబాబు చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది మిర్చి రైతుల అంశంపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం ద్వారా పంటను కొనుగోలు చేసి మార్కెట్ ధర – సాగు ఖర్చుకు మధ్య ఉన్న తేడాను కేంద్రం చెల్లించడం, ఈ స్కీం కింద సేకరించే సరుకు మొత్తం పరిమితిని 25 శాతం నుంచి 75 శాతానికి పెంచడం, మిర్చి సాగు వ్యయాన్ని ఐకార్ నిర్ణయం ప్రకారం కాకుండా ఏపీ సర్కార్ నిర్ణయించిన రూ.11 వేల 600 పరిగణలోకి తీసుకోవడం,మిర్చి పంట ఎగుమతులకు ఉన్న అడ్డంకులను తొలగించడంపైనే ప్రధానంగా చర్చించారు. ఇందులో మొదటి మూడు డిమాండ్లకు కేంద్రం సానుకూలంగా స్పందించగా..ఎగుమతులపై మాత్రం రాష్ట్రంలో ప్రత్యేక సదస్సు నిర్వహించి, రైతులు, ఎగుమతిదారులు, ఇతర భాగస్వాముల సలహాలు, సూచనలు తీసుకోని నిర్ణయం తీసుకోనున్నారు.
గత కొద్దికాలంగా సరైన ధర లేక మిర్చి రైతులు ఆందోళనలో ఉన్న విషయం తెలిసిందే. ఐతే ఈ విషయంపై వెంటనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు చంద్రబాబు. వెంటనే ఆయన ఢిల్లీ కూడా వెళ్లారు. ఐతే ఆ సమయంలో వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ పర్యటనలోనూ ఉండడంతో ఆయనతో భేటీ కావడం వీలు కాలేదు. ఐతే మధ్యప్రదేశ్ వచ్చిన వెంటనే మిర్చి రైతుల సమస్యలపై సమావేశం నిర్వహించారు శివరాజ్ సింగ్ చౌహాన్. సమస్యపై అన్ని కోణాల్లో చర్చించి పరిష్కారం చూపించే విధంగా చర్యలకు ఆదేశించారు. ఈ నిర్ణయంతో గుంటూరు, పల్నాడు, రాయలసీమలోని లక్షలాది రైతులకు ప్రయోజన చేకూరనుంది.
ఇక ఈ సందర్భంగా చంద్రబాబుపైనా ప్రశంసలు కురిపించారు శివరాజ్‌సింగ్ చౌహాన్. చంద్రబాబు నాయుడు అంటే తనకు ఎంతో గౌరవమని, ఆయన ఒక సమస్యను ఢిల్లీ వరకు తెచ్చారంటే దాని తీవ్రతను అర్థం చేసుకోవచ్చన్నారు.











