దుబ్బాక టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇటీవల మరణించడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నకకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కూడా ఎన్నికల సంఘం ఇటీవలే ప్రకటించింది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు మొత్తం 6 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అయితే ఇందులో ఐదుగురు వ్యక్తులు కలియుగ పాండవుల పేరుతో ఇండిపెండెంట్‌గా నామినేషన్‌లు వేశారు. తొలిరోజే ఇలాంటి సంఘటన జరగడంతో నియోజకవర్గ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
తొలి రోజు వచ్చిన 6 నామినేష్లలో 5 కలియుగ పాండవుల పేరుతోనే ఉండడం గమనార్హం. కలియుగ పాండవుల పేరుతో నామినేషన్ వేసినవారు వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉండడం విశేషం. ఉప్పల్‌కు చెందిన రేవు చిన్న ధన్‌రాజ్, ధర్మపురికి చెందిన మోతె నరేష్, కరీంనగర్‌కు చెందిన కె.శ్యామ్‌కుమార్, వేములవాడకు చెందిన బుర్ర రవితేజగౌడ్, చొప్పదండికి చెందిన మరోక అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నట్లు తెలిసింది.
సమస్యలపై పోరాటం కోసమే..
ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టి కి తీసుకుపోయేందుకే ఇండిపెండెంట్లుగా నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది. నిరుద్యోగ సమస్యలపై తమ పోరాటం ఉంటుందని వారు తెలిపారు. అలాగే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలనే డిమాండ్‌ను ఆ ఐదుగురు అభ్యర్థులు లేవనెత్తుతున్నారు. కలియుగ పాండవుల్లాగా ప్రజా సమస్యలతోపాటు, ఎన్నికల్లో పోరాడుతామని పేర్కొంటున్నారు.
సోలిపేట రామలింగరెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో దుబ్బాకకు ఉప ఎన్నిక జరగనుంది. తెరాస అభ్యర్థిగా రామలింగారెడ్డి భార్య సుజాత, బిజెపి అభ్యర్థిగా రఘునందన్‌రావు, కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. నవంబర్ 3వ తేదీన పోలీంగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నామినేషన్లకు చివరి తేదీ ఈనెల 16. నామినేషన్ల ఉప సంవహరణకు చివరి గడువు ఈనెల 19గా ఉంది. అయితే మొదటి రోజే స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేయడం చూస్తుంటే చివరి గడువు వరకు ఇంకా ఇలా ఎంతమంది నామినేషన్లు వేస్తారో అనే చర్చ నియోజకవర్గ ప్రజల్లో జరుగుతోంది.











