ఏపీలో చంద్రబాబు సీఎం అయ్యాక అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి. రాష్ట్రంలో రాజధాని అమరావతి, పోలవరం సహా కీలక ప్రాజెక్టులు అన్నీ పూర్తి కావాల్సి ఉంది. రాష్ట్రానికి ఉన్న ఆదాయ వనరులు, రాబడితో సొంతంగా ప్రభుత్వం వీటిని పూర్తి చేయడం సాధ్యం కాని పని. వాటికి కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా ఆర్థిక సాయం చేయాల్సి ఉంటుంది. విభజన చట్టంలో కూడా ఈ విషయాలు ఉండడంతో ఏపీలోని వివిధ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి చట్ట ప్రకారం నిధులు రావాల్సి ఉంటుంది.
అందులో భాగంగా అమరావతి, పోలవరం విషయంలో కేంద్రం ఇప్పటికే సానుకూలంగా ఉంటోంది. అమరావతికి రూ.15 వేల కోట్ల రుణం ఇప్పించేందుకు ముందుకు వచ్చింది. పోలవరం కొత్త సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) కు కూడా ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం నుంచి కేంద్రానికి తాజాగా మరో అభ్యర్ధన అందినట్లు తెలిసింది. దీని పైన ఇప్పుడు తీసుకొనే నిర్ణయం పోలవరం ప్రాజెక్టుకు కీలకంగా మారనుందని అంటున్నారు. పోలవరం ప్రాజెక్టులో కీలకంగా ఉండే కొత్త డయాఫ్రం వాల్, దానిపై ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం నిర్మాణాలను రెండూ ఒకేసారిగా సమాంతరంగా చేపట్టడం కోసం వెంటనే రూ.7 వేల కోట్లు మంజూరు చేయాలంటూ కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ కోరనుంది.
పోలవరం ప్రాజెక్టులో మిగిలిన ప్రధాన డ్యాం పనులు పూర్తి చేసేందుకు రూ.12,127 కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయించింది. ఈ సమాచారాన్ని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్రానికి చేరవేసింది. తాజా నిర్ణయంతో 2025 మార్చిదాకా అవసరమయ్యే నిధుల కోసం అభ్యర్థన పంపాలని సూచించింది. దీంతో వెంటనే రూ.7 వేల కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు విజ్ఞాపన పంపనుందని అంటున్నారు. కేంద్రం సానుకూలంగానే స్పందిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
పైగా చంద్రబాబు కూడా గతంలో జగన్ చేసిన తప్పు చేయకుండా కొత్త టెండర్లకు వెళ్లడం లేదు. ఇప్పటికే నిర్మాణ పనులు చేపడుతున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థకే వాటి నిర్మాణ పనులు అప్పగించాలని ఖరారు చేశారు. ఈ మేరకు జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఇటీవల మెమో జారీ చేశారు. నవంబరు నుంచి కొత్త వాల్ నిర్మాణ పనులు చేస్తూనే.. దాంతో పాటు సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం కూడా కట్టడం వల్ల రెండు సీజన్లు కలిసి వస్తాయని అంటున్నారు. సంవత్సరంన్నరలోపే ఈ రెండు కీలక నిర్మాణాలు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అటు జలశక్తి శాఖ కూడా 2027 నాటికి పోలవరం తొలిదశ పూర్తికావాలని టార్గెట్ పెట్టింది. దీంతో ఇప్పుడు కేంద్ర నిర్ణయం ఆసక్తిగా మారింది.











