రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో.. ఓడలు బళ్ళు… బళ్ళు ఓడలవ్వడం చాలా కామన్. ‘కొట్టిందే కొడతాడు’ అనే అపప్రదను మూటగట్టుకున్న తమన్ ఇప్పుడు చితక్కొడుతున్నాడు. ‘అల వైకుంఠపురములో’ అల్ టైమ్ మ్యూజికల్ హిట్ గా నిలవడం అతన్ని అందలాలు ఎక్కించేసింది. ఇక.. ‘షెడ్డుకు’ వెళ్ళిపోయాడు అనుకున్న మణిశర్మ.. ‘ఇస్మార్ట్ శంకర్’ తో బౌన్స్ బ్యాక్ అయ్యి.. ఏకంగా మెగాస్టార్ మనసు దోచేసుకున్నాడు. ‘ఆచార్య’ ఫస్ట్ లుక్ బీజీయం మణిశర్మ మార్క్ మరోసారి ప్రకటించింది.
కానీ.. దేవిశ్రీప్రసాద్ అలియాస్ డి.ఎస్.పి మాత్రం గత కొంతకాలంగా సరైన హిట్ లేక అల్లాడుతున్నాడు. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి పోటీగా విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సోసో మార్కులతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఇంకా చెప్పాలంటే… ‘రంగస్థలం’ తర్వాత దేవికి సరైన మ్యూజికల్ హిట్ లేదు. దాంతో… ‘మిర్చి’ మొదలుకుని… ‘భరత్ అనే నేను’ వరకు దేవితో మ్యూజిక్ చేయించుకున్న కొరటాల.. మెగా సిఫార్సుకు కట్టుబడి… ‘ఆచార్య’ కోసం ‘డి.ఎస్.పి’ ప్లేస్ లో మణిశర్మను తీసుకోవాల్సివచ్చింది.
అంతేకాదు… తన దర్శకత్వంలో అల్లు అర్జున్ తో రూపొందిస్తున్న ‘పుష్ప’కోసం మ్యూజిక్ డైరెక్టర్ గా తన ఆస్థాన సంగీత దర్శకుడు డి.ఎస్.పిని కంటిన్యూ చేయడం కోసం సుకుమార్ చాలా కష్టపడాల్సి వచ్చిందనే వార్తలు జోరుగా వెలువడ్డాయి అంటే… మ్యూజిక్ డైరెక్టర్ గా దేవి ‘నెంబర్ వన్’ స్థానానికి ‘డేంజర్ బెల్స్’ ఏ రేంజ్ లో మోగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ‘అల వైకుంఠపురములో’ వంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన తమన్ ను రిపీట్ చేయడం కోసం బన్నీ బాగా పట్టుపట్టాడనే గుసగుసలు వినిపించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో… ‘పుష్ప’తో తనను తాను మళ్లీ కొత్తగా ఆవిష్కరించుకోకపోతే… గత పదేళ్లుగా ఆక్రమించుకుని ఉన్న తెలుగు సినిమా సంగీత సింహాసనాన్ని దేవిశ్రీప్రసాద్ కోల్పోవాల్సి వస్తుంది!!











