మట్టిని తరలించుకుపోతున్న మాఫియాను ప్రశ్నించడమే తప్పనట్టుగా ఓ దళిత యువకుడిపై వైసీపీ గూండాలు దాడికి పాల్పడితే… దాడి చేసిన వారిపై కేసు న మోదు చేయాల్సిందిపోయి… బాధితుడిపైనే రౌడీ షీట్ తెరిచిన ఏపీ పోలీసుల తీరుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మాఫియాను అడ్డుకునేందుకు యత్నించిన దళిత యువకుడిని అభినందించడానికి బదులుగా అతడిపై కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నిస్తూ డీజీపీ గౌతం సవాంగ్ కు చంద్రబాబు ఆదివారం లేఖ రాశారు. బాధితుడిపై నలుగురు వైసీపీ గూండాలు జరిపిన దాడికి సంబంధించిన వీడియోను కూడా ఈ లేఖకు చంద్రబాబు జత చేశారు.
వైసీపీ గూండాల దాడి
ఈ ఘటన వివరాల్లోకి వెళితే… నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం కమ్మపాలేనికి చెందిన కరటక మల్లికార్జున్… గ్రామ సమీపంలో మట్టి తరలించుకుపోతున్న వైనంపై మట్టి మాఫియాను ప్రశ్నించాడట. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న మాఫియా… ఈ నెల 16న తన స్వగ్రామం నుంచి నెల్లూరుకు బైక్ పై వెళుతున్న మల్లికార్జున్ ను వైసీపీకి చెందిన గూండాలు అడ్డగించారు. తొలుత ఇద్దరు వైసీపీ గూండాలు మల్లికార్జునను ఆపేస్తే… ఆ వెంటనే మరో ఇద్దరు వైసీపీ గూండాలు మల్లికార్జునపై దాడికి దిగారు. ఊహించని ఈ ఘటన నుంచి తప్పించుకునేందుకు మల్లికార్జున పరుగులు తీయగా… నలుగురు వైసీపీ గూండాలు అతడికి వెంటాడి మరీ దాడికి దిగారు.
అన్యాయాన్ని అడ్డుకోవడమే నేరమా?
వైసీపీ గూండాలు చేసిన దాడిపై అదే రోజు సాయంత్రం మల్లికార్జున్ కొడవలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దీనిపై కేసు నమోదు చేసేందుకు నిరాకరించిన పోలీసులు… అనూహ్యంగా మల్లికార్జున్ పైనే దౌడీ షీట్ తెరిచారట. ఈ విషయంపై సమాచారం అందుకున్న చంద్రబాబు… ఇదెక్కడి న్యాయమంటూ డీజీపీకి లేఖ రాశారు. అన్యాయాన్ని అడ్డుకునేందుకు ఓ దళిత యువకుడు సాహసం చేస్తే.. అతడిపై దాడికి దిగిన వారిని అరెస్ట్ చేసి శిక్షించాల్సింది పోయి.. బాధితుడిపైనే రౌడీ షీట్ తెరవడమేమిటని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మల్లికార్జున్ పై తెరచిన రౌడీ షీట్ ను రద్దు చేయడమే కాకుండా మల్లికార్జున్ పై దాడికి దిగిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Must Read ;- రెండేళ్లలో 30 మంది టీడీపీ నేతల హత్య.. వైసీపీపై చంద్రబాబు ఫైర్












