వైసీపీ నేతలు మానవత్వం మరచి ప్రవర్తిస్తున్నారని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికలు ముగిసి నెల గడుస్తున్నా వైసీపీలో మాత్రం ఓటమి బాధ ఇంకా తొలగలేదని ఆయన విమర్శించారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం కొత్తపాలెం గ్రామంలో గర్భిణి రోజాను వైసీపీ గూండాలు మానవత్వం లేకుండా తన్నడంపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రోజా భర్త గుడె రామారావు టీడీపీ అభ్యర్థిగా 590 ఓట్ల మెజారిటీతో సర్పంచ్ గా విజయం సాధించాడన్న అక్కసుతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడుల వీణ మోగాల్సిన రాష్ట్రంలో దౌర్జన్యం, దమనకాండ పెల్లుబుకుతోందని, ఓటమిని అంగీకరించలేని వైసీపీ నాయకులు దాడికి తెగబడిందిగాక తిరిగి మా కార్యకర్తలపైనే కేసులు పెట్టారని ఆయన వాపోయారు.
వైసీపీ కార్యకర్తల్లా పోలీసులు
ఏపీలో వైసీపీ క్రూరత్వం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని, మహిళల రోదన మీ కంటికి కనిపించడం లేదా అని అచ్చెన్న ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్యనున్న గురుత్వాకర్షణ శక్తి తొలగాలని, లేదంటే ప్రజలే మీ శక్తిని నశింపజేస్తారని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చినా ప్రయోజనం లేకుండాపోయిందన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు డాక్టర్ సునీతకే న్యాయం జరక్కపోతే రాష్ట్రంలో మహిళలకు భరోసా ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.
Must Read ;-, టీడీపీ నేతల నోట కోవర్టుల మాట.. వైసీపీ, బీజేపీల్లో టెన్షన్ !