( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖలో ఆక్రమణల తొలగింపు వ్యవహారంలో అధికార పార్టీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు బాహాటంగా విమర్శిస్తున్నాయి. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తుండడంతో కళ్ళెదుటే ఘోరాలు జరుగుతున్నా నోరు మెదపలేని దయనీయ స్థితిలో ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు ఉన్నాయి. అయితే కమ్యూనిస్టులు మాత్రం ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. భూ కబ్జాలపై చర్యలు చర్యలు తీసుకోవాలని, బడాబాబుల చేతుల్లో ఉన్న అక్రమ భూములను నిష్పాక్షికంగా వెలికి తీయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆ భూకబ్జాలకు కేంద్రంగా విశాఖ..
విశాఖ జిల్లా భూ కబ్జాలకు కేంద్రంగా మారింది. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు, పేదల ఎస్సైన్డ్ భూములు కబ్జాకు గురయ్యాయి. రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని భారీ స్థాయిలో భూ ఆక్రమణలు కొనసాగుతునే వున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ భూ తిమింగిలాల చేతుల్లో ఉన్న ఆక్రమణలపై చర్యలు తీసుకోవడంపై చిత్తశుద్దితో వ్యవహరించటం లేదనీ కమ్యూనిస్టులు విమర్శిస్తుంటే, తెలుగుదేశం పార్టీ నేతలు కక్షసాధింపు చర్యగా అభివర్ణించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకి అతీతంగా భూ ఆక్రమణదారులందరిపై చర్యలు తీసుకోవాలని, భూములను స్వాధీనం చేసుకోవాలని, వాటిని పేదలకు పంపిణీ చేయాలని సిపిఐ(ఎం) పార్టీ డిమాండ్ చేస్తున్నది.
50 వేల కోట్ల విలువైన భూములు కబ్జా..
విశాఖ చుట్టూవున్న 11 మండలాలు విశాఖ రూరల్, విశాఖ అర్బన్, ఆనందపురం, భీమిలి, పద్మనాభం, సబ్బవరం, పెందుర్తి, అనకాపల్లి, పరవాడ, పెదగంట్యాడ, గాజువాకలో సుమారు 50 వేల కోట్ల విలువైన భూములు కబ్జాకు గురయ్యాయని సిపిఎం నాయకుడు సిహెచ్ నర్సింగరావు బహిరంగసభలో ఆరోపించారు. “ కేవలం ఒక పక్షానికి చెందిన భూములపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇటీవల జరిగిన వరుస ఉదంతాలే అందుకు నిదర్శనం” అని అన్నారు.
Also Read ;- మీడియాకు పరోక్షంగా బెదిరింపులు.. విశాఖలో సరికొత్త సంస్కృతి
సిట్ నివేదిక ఇంకెన్నాళ్లు..
విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తరువాత, ప్రభుత్వ పెద్దలు విశాఖపై ఎనలేని ప్రేమ కనబరుస్తున్నారు. ఆక్రమణలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని ఆక్రమణలు తొలగిస్తున్నట్టు ప్రకటనలు ఇస్తున్నారు. అధికార పార్టీ వారినైనా ఈ విషయంలో మినహాయింపు ఇవ్వబోమని చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. వేలాది ఎకరాల భూ కుంభకోణం పై సిట్ ఇచ్చిన రిపోర్టుపై ఇప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకో లేదు. 4 వేల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురయ్యిందని, 250 ఎకరాల్లో అక్రమంగా 43 ఎన్‌ఓసీలు ఇచ్చారని వాటన్నింటిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిట్ కోరినప్పటికి ఎలాంటి చర్యలు చేపట్టటం లేదు. ఇందులో అధికార, ప్రతిపక్షాలకు చెందిన బడా నాయకుల పాత్ర ఉండటం వల్లే ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదన్నది బహిరంగ రహస్యం. వైసిపి అధికారంలోకి వచ్చాక వేసిన రెండో సిట్ నివేదిక, మొదటి సిట్ నివేదిక ఈ రెండింటిని రాజకీయపక్షాలు ఎందుకు బయట పెట్టడం లేదో కారణం చెప్పాలని కమ్యూనిస్టులు డిమాండ్ చేస్తున్నారు.
వైసిపి కూడా సిట్ నివేదిక బయటపెట్టకపోవడం వెనుక ఆ పార్టీ నేతల హస్తం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.
ఆ భూములతోనే వేల కోట్లు..
గతంలో వేసిన సిట్1, సిట్2 నివేదికలు బహిర్గత పరిస్తే రూ.50వేల నుంచి రూ.లక్ష కోట్ల విలువైన భూ ఆక్రమణలు వెలుగుచూస్తాయని ప్రభుత్వానికి భూములు అమ్ముకోవాల్సిన గత్యంతరం ఉండదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వి ఎం ఆర్ డి ఎ చేపట్టిన ల్యాండ్‌పూలింగ్‌లో సుమారు 500 కోట్ల విలువ చేసే భూ అక్రమాలు జరిగాయని ఆనాటి ఉడా వైస్‌ఛైర్మన్‌గా వున్న కోన శశిధర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని నర్సింగరావు చెబుతున్నారు. ఇప్పుడు వాటి విలువ సుమారు 5 వేల కోట్లపైగానే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఆ భూములన్నీ బడా రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉన్నాయని వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
గాజువాక లో అనేక అక్రమాలు..
గాజువాకలో 274 సర్వే నెంబరులో, 86 సర్వే నెంబరులో, గాజువాక ఇనాం భూములు వందలాది ఎకరాలు కబ్జాకు గురై ఇప్పటికీ రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉన్నాయి.ఈ భూములన్నీ అక్రమంగా అమ్ముకుంటూ వందలకోట్లు రూపాయిలు సంపాదిస్తున్నారు చోటా నాయకులు. పేదల ఎస్సైన్డ్ భూములు కొంతమంది రాజకీయ నాయకులు ఆక్రమించినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పై పెచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ నగర చుట్టు పేదల అస్సైన్డ్ భూములును పెద్ద ఎత్తున దౌర్జన్యం చేసి తీసుకుంటున్నదని కమ్యూనిస్టులు గగ్గోలు పెడుతున్నారు.
భూములు అమ్మడం సిగ్గుచేటు..
రాష్ట్ర ప్రభుత్వం విశాఖనగరంలో ప్రజాప్రయోజనాలకు ఉపయోగపడే ప్రభుత్వ కార్యాలయాల స్థలాలు, హాస్పటల్స్ స్థలాలు, విద్యాసంస్థల స్థలాలు, ఇతర ఖాళీ స్థలాలు పెద్ద ఎత్తున బిల్డ్ ఎపి మిషన్, ఎపి స్టేట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ పేరుతో అమ్మకానికి పెట్టడం సిగ్గుచేటని సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన తీవ్రంగా ఖండిస్తున్నాయి. అయినా వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఇలా విక్రయించడం ప్రభుత్వం చేసే కబ్జా గా కమ్యూనిస్టులు ఆరోపిస్తున్నారు.
ఒక పార్టీ టార్గెట్…
రాష్ట్ర ప్రభుత్వం విశాఖ నగరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించినవారు ఎంతటివారైనా వారందరిపైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని సీపీఐ గ్రేటర్ విశాఖ నగర కార్యదర్శి ఎం పైడిరాజు డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ కక్ష తో ఒక పార్టీని టార్గెట్ చేసే చర్యలు సరైనవి కావని, ప్రభుత్వ భూములను ఏ రాజకీయ పార్టీ నాయకులు ఆక్రమించినా రాష్ట్ర ప్రభుత్వం వివక్ష లేకుండా స్వాధీనం చేసుకునేలా ఉండాలని ఆయన హితవు పలికారు. అధికార పార్టీలో కూడా కొంతమంది బడా నాయకులు పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను కబ్జా చేసారని ఆయన ఆరోపించారు. మాజీ శాసనసభ్యుడు తిప్పల గురుమూర్తి రెడ్డి, ప్రస్తుత గాజువాక శాసనసభ్యుడు తిప్పల నాగిరెడ్డి కుటుంబ సభ్యులు 13 మంది పేరున మైనర్లు గా ఉన్నప్పుడే పేద వారని చెప్పి ప్రభుత్వ రికార్డులలో నమోదు చేసుకుని నేటికీ దర్జాగా అనుభవిస్తున్నారని అటువంటి వారిపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఆ భూములను కాపాడే దిశగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వంద రోజుల్లో సిట్ నివేదికను బహిర్గతం చేసి, ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారందరిపై చర్యలు తీసుకుంటామని చెప్పి రెండేళ్లు గడిచినా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది అని అన్నారు. అనేక సంవత్సరాలుగా విశాఖ రూరల్ మండలం కొమ్మాది సర్వే నెంబర్ 28 /2 వైసీపీ నాయకుడు కె శ్రీనివాసరెడ్డి కబ్జా చేసిన భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. “ మీ పార్టీ నాయకులు ఆక్రమణలకు పాల్పడితే ఒక రూలు.. ప్రతిపక్షాలు ఆక్రమిస్తే మరో రూలా?” అని ప్రశ్నించారు.
Must Read ;- డామిట్ ! కథ అడ్డం తిరిగింది.. వైసీపీ అర్ధరాత్రి యాక్షన్ ప్లాన్‌కు బ్రేక్











