కేరళ కొచ్చిలో నిర్వహించిన ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ సదస్సులో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన సమాధానాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుత రాజకీయ, సామాజిక అంశాలపై లోకేష్ ఇచ్చిన స్పష్టమైన సమాధానాలకు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం ఫిదా అయ్యారు. క్లిష్టమైన ప్రశ్నలకు ఎంతో పరిణతితో, సూటిగా లోకేష్ కౌంటర్లు ఇవ్వడంపై ప్రశంసలు కురిపించారు.
కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై కాంగ్రెస్ సహా విపక్షాలు చేస్తున్న ఆరోపణలను లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు లేని ఆరోపణలు, గెలవని చోట మాత్రం వ్యవస్థలపై రుద్దడం ఏమాత్రం ఎందుకని ప్రశ్నించారు. ఓటమిని ఒప్పుకోకుండా ECIని తప్పుపట్టడం సరికాదని హితవు పలికారు. అంతేకాకుండా, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు బలమైన క్యాడర్, ఆర్గనైజేషన్ నిర్మాణమే లేకపోవడం వల్లనే పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంటోందని విశ్లేషించారు.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న GEN-Z ఆందోళనలపై లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. యువత సమస్యలను ఏ ప్రభుత్వమైనా సీరియస్‌గా విని, పరిష్కరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తాము నేరుగా యువతతో సమావేశమై వారి ఆలోచనలను, అభ్యర్థనలను తెలుసుకుంటున్నామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే దిశగా సానుకూల ధోరణితో ముందడుగు వేస్తోందని చెప్పారు. నేటి తరం అవసరాలకు అనుగుణంగా కొన్ని రంగాల్లో తక్షణమే సంస్కరణలు తీసుకురావాలని, ముఖ్యంగా భారీ స్థాయిలో ఉద్యోగాల సృష్టి జరగడమే దీనికి సరైన పరిష్కారమని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయన్న రాజ్‌దీప్ ప్రశ్నకు లోకేష్ చాలా పరిణితితో సమాధానమిచ్చారు. రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనన్నారు. కానీ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని చెప్పారు. ఏపీ GST రెండంకెల వృద్ధిని నమోదు చేసిందన్నారు.
ఉచిత పథకాలపై ప్రశ్నకు లోకేష్ తెలివిగా సమాధానం చెప్పారు. ఉచిత పథకాల విషయంలో రాజకీయనాయకుడిది ఎంత బాధ్యత ఉంటుందో సాధారణ ఓటరుది అంతే బాధ్యత ఉంటుందన్నారు. పేదరికం నుంచి బయటపడిన వ్యక్తులు ఉచిత పథకాలను వదులుకోవాలని సూచించారు.
పోటీ పరీక్షల నిర్వహణ, పేపర్ లీకేజీల అంశంపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ వైసీపీకి లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. DSCని అత్యంత పారదర్శకంగా నిర్వహించామన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థను, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసిన తీరును ఎండగట్టారు. భవిష్యత్తులో అలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకమైన విధానాలను అమలు చేస్తున్నామని హామీ ఇచ్చారు. కాంక్లేవ్‌లో లోకేష్ చూపిన నాయకత్వ పటిమ, సమర్థవంతమైన సమాధానాలు జాతీయ స్థాయిలో ఆయన గ్రాఫ్‌ను మరింత పెంచాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.











