వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ మెడకు మరో భారీ స్కామ్ చుట్టుకుంది. పందుల పెంపకం పేరుతో ఏకంగా 25 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాహా చేశారనే ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న వేళ, గుంటూరు నగర నడిబొడ్డున ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తిని కొట్టేసేందుకు పన్నిన వ్యూహం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
బాపట్ల-గుంటూరు ప్రాంతాల్లోని గుంటూరు చుట్టుగుంట పరిధిలో ఉన్న APSIDCకి చెందిన 1,840.83 చదరపు మీటర్ల విలువైన ప్రభుత్వ భూమి బదలాయింపు వ్యవహారంలో ఈ అక్రమాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. నగరంలో కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను టార్గెట్ చేసిన నేతలు, పందుల పెంపకందారుల పేరుతో ఈ భూమిని ఆక్రమించుకునేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలను పూర్తిగా పక్కనబెట్టి, అధికార బలంతో ఈ రకమైన ల్యాండ్ గ్రాబింగ్‌కు పాల్పడటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఈ భూ దందా వ్యవహారంలో అసలు లబ్ధిదారులు ఎవరు.? పందుల పెంపకం పేరు చెప్పి ఎవరికి ప్రయోజనం చేకూర్చారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. భూ బదలాయింపు ప్రక్రియలో అసలు నిబంధనలు పాటించారా లేదా? అధికారుల పాత్ర ఏమిటి? అనే కోణంలో విచారణ జరగాల్సిన అవసరం ఉంది. పేదల పేరు చెప్పి వెనుక ఉండి నడిపించిన అసలు సూత్రధారులను బయటకు తీయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
వరుస వివాదాలతో సతమతమవుతున్న జోగి రమేష్‌కి ఈ కొత్త పందుల పెంపకం భూ కుంభకోణం మరో పెద్ద మచ్చగా మారనుంది. ప్రభుత్వ భూములను తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, సొంత అనుచరులకు కట్టబెట్టడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ రూ.25 కోట్ల భూ బదలాయింపు వ్యవహారంపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, ఆక్రమణకు గురైన APSIDC భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.











