ఏ విషయాన్నైనా చిరంజీవి ఒకటికి పదిసార్లు ఆలోచన చేస్తారు. తన అభిప్రాయాన్ని అనుభవం కలిగినవారి ముందుంచి, వాళ్ల సూచన మేరకే తగిన నిర్ణయం తీసుకుంటారు. ఎక్కడా తొందరపడటం .. హడావిడి చేయడం .. మొహమాటాలకు పోవడం ఆయనకి తెలియదు. నిలకడ .. నిబ్బరం .. నిదానం .. ఇది ఆయన స్టైల్. అందుకు భిన్నంగా ఆయన ఎంతమాత్రం వ్యవహరించరు. పరిశ్రమలో ఆయనకి సన్నిహితంగా ఉండే చాలామందికి ఈ విషయం తెలుసు. అలాంటి చిరంజీవి ఒకదాని తరువాత ఒకటిగా భారీ సినిమాలను రీమేక్ చేయనున్నట్టుగా వార్తలు రావడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

‘ఆచార్య’ తరువాత ఆయన చేయనున్న ప్రాజెక్టు ‘లూసిఫర్’ రీమేక్ మాత్రమేననేది తాజా సమాచారం. ‘వేదాళం’ రీమేక్ సంగతి తరువాత చూద్దామని ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి ‘ఆచార్య’ ప్రాజెక్టు కూడా చిన్నదేమీ కాదు. బడ్జెట్ సంగతి అటుంచితే కథాకథనాల పరంగా చూసుకుంటే విస్తృతమైన పరిధిని కలిగినదిగా కనిపిస్తుంది. ఆ తరువాత సినిమాగా చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ ను రెడీ చేసుకోవడంలో అర్థం ఉంది. కానీ ఈ గందరగోళంలోనే ఆయన ‘వేదాళం’ రీమేక్ విషయాన్ని గురించిన ఆలోచన చేయరనేది సన్నిహితుల అభిప్రాయం.
‘వేదాళం’ రీమేక్ డైరెక్టర్ గా మెహర్ రమేశ్ పేరు వినిపించింది. మెహర్ రమేశ్ భారీ సినిమాలు చేశాడు .. కానీ అవి భారీ విజయాలను మాత్రం అందుకోలేదు. చిరంజీవి తన సినిమా చేసే డైరెక్టర్ సక్సెస్ గ్రాఫ్ ను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటాడనే విషయం అందరికీ తెలిసిందే. ఇక షాట్ కి .. షాట్ కి మధ్య గ్యాప్ లో చిరంజీవి కథలను ఓకే చేయరు. దానిపై నెలలపాటు కసరత్తు జరగాలి. ఆ కథల విషయంలో ఆయన తనతో గతంలో సినిమాలు చేసిన సీనియర్ దర్శకుల అభిప్రాయాలను .. పరుచూరి బ్రదర్స్ వంటి సీనియర్ రచయితల సూచనలను కూడా తీసుకుంటారు. తెరవెనుక అలాంటివేం జరిగాయో తెలియదుగానీ, ‘వేదాళం’ రీమేక్ ఇప్పట్లో లేదనే టాక్ మాత్రం ఫిల్మ్ నగర్లో బలంగానే వినిపిస్తోంది.











