నవ్వురాని వాడిని , నవ్వలేని వాడిని దూరంగా ఉంచు . వాడు అతి ప్రమాదకరమైన వ్యక్తిగా గుర్తించు.. నవ్వు నాలుగు విధాల చేటు కాదు.. నలభై విధాల గ్రేటు అనే హాస్య సూత్రాలు వల్లెవేసి.. తెలుగు తెరమీద కొన్ని దశాబ్దాల కాలం పాటు .. పువ్వులాంటి స్వచ్ఛమైన తన నవ్వుతో .. అందరినీ నవ్వించి నవ్వించి పొట్ట చెక్కలు చేశారు రాజబాబు.
రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. తెలుగు తెర పేరు మాత్రం అందరికీ తెలిసిన రాజబాబు. అక్టోబరు 20 ఆయన జయంతి. ఈ సందర్భంగా.. ఆయన తమ్ముడు చిట్టి బాబు తన అన్నను గుర్తు చేసుకుంటూ.. ఎవరికీ తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు.. అవేమిటో మీరే చదివి తెలుసుకోండి.
* నా అసలు పేరు పుణ్యమూర్తుల సూర్యనారాయణ మూర్తి. సినీపరిశ్రమలో అందరూ నన్ను చిట్టిబాబు అని పిలుస్తారు. మా స్వస్థలం ఆంద్రప్రదేశ్ లోని రాజమండ్రి. కానీ నేను అమలాపురంలో పుట్టాను. ssc చదువును రాజమండ్రిలో పూర్తి చేశాను. ఆ తర్వాత ఐటిఐ కాకినాడలో చేశాను. ఐటిఐ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చేశాను. ఉద్యగం చేస్తూ హైదరాబాద్ లో ఉన్న ఈవెనింగ్ కాలేజీలోని బి.కామ్ కోర్స్ లో జాయిన్ అయ్యా. బి.కామ్ చదివినప్పుడు కాలేజీలో కల్చరల్ వింగ్ కు సెక్రటరీగా ఉన్నా.
బెస్ట్ కమిడియన్ అవార్డు వచ్చింది కూడా. అప్పటి నుండి నేను డ్రామాలు వేయడం మొదలు పెట్టాను. నాకు మొత్తం ఇద్దరు సోదరిమణులు, ముగ్గురు సోదరులు. అందులో పెద్దవాడు రాజబాబు. మా అన్నయ్య నరసాపురంలో పుట్టాడు. రాజబాబుగారు నవ్వు, సినిమా ఉన్నంతకాలం ప్రేక్షకులకు గుర్తిండిపోతారు. ఆయన చాలా దానాలు, ధర్మాలు చేసి సినీ పరిశ్రమలో ఒక మనసున్న మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన హాస్యం పండించడంలో మకుటంలేని మహారాజుగా వెలిగి తనువు చాలించారు.
* మా అన్నయ్య సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఆయన కూడా యస్.యస్.యల్సీ రాజమండ్రిలోనే పూర్తి చేసారు. ఆతర్వాత టీచర్ ట్రైనింగ్ అయ్యి, ఉద్యోగంలో చేరారు. ఉద్యోగం చేస్తుండగానే ఆయన అనేక నాటకాల్లో నటించేవారు. టీచర్ ఉద్యోగం వదిలేసి విజయవాడలో ఉన్న మహావీర్ మెడికల్ కంపెనీలో జాయిన్ అయ్యారు. అక్కడ పని చేస్తూనే విశాఖపట్నంలో బాగా ఫేమస్ అయిన కే. వెంకటేశ్వరరావు డ్రామా కంపెనీలో చేరి నాటకాలు వేసేవారు. రాజబాబుగారు వేసిన డ్రామాలలో ‘దొంగవీరుడు’ అనే నాటకానికి మంచి గుర్తింపు వచ్చింది.
ఆ నాటకాన్ని రాజారావు అనే వ్యక్తి చూశారు. ఆయన మద్రాసులో ఉంటారు. ఆయనే జమునగారిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన ‘దొంగవీరుడు’ అనే నాటకాన్ని చూడడం వెంటనే అన్నయ్యను సినిమా ఇండస్ట్రీకి తీసుకువెళ్లడం జరిగింది. ఇండస్ట్రీకి వెళ్లిన కొత్తలో అన్నయ్య చాలా కష్టపడ్డారు. కొన్నాళ్ళు సినిమాలలో వేషాలు రాలేదు. ఆటైంలో కాళీగా ఉండకుండా పిల్లలకు ట్యూషన్ చెప్పేవారు.
* చిన్నప్పటినుండి మంచిగా మిమిక్రి చేసేవారు. మద్రాసులో ట్యూషన్ చెప్పుకుంటూ, మిమిక్రి షోలు చేసేవారు. రాజబాబుకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ‘సర్కారు ఎక్స్ ప్రెస్’. ఆసినిమా తర్వాత వెనుతిరిగి చూడలేదు అన్నయ్య. అయన ఎంతలా ఎదిగారంటే రాజబాబు లేకపోతె సినిమా ఆడదు అన్న స్థాయికి వచ్చేసారు. అప్పట్లో నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు రాజబాబుతో కలిసి యాక్ట్ చేయడానికి వెయిట్ చేసేవారు. అప్పటి దర్శకులు హీరోల డేట్లుకు ముందు రాజబాబు డేట్లు తీసుకునేవారు. ఒక్కొక్క సినిమాకు హీరోకు తగ్గట్లుగానే రాజబాబు కూడా రెమ్యూనరేషన్ తీసుకునేవారు. అప్పట్లో నంది అవార్డ్స్ ఉండేవి కావు. ఫిలింఫేర్ అవార్డ్స్ మాత్రమే ఉండేవి.
* రాజబాబుకు వరుసగా తొమ్మిది సంవత్సరాలు బెస్ట్ కమిడియన్ గా ఫిలింఫేర్ అవార్డ్స్ వచ్చాయి. ఆయన ఒక్క ఏడాదిలో 32 సినిమాలలో నటించి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. రాజబాబు దాదాపు 450 చిత్రాలలో నటించారు. అందులో 370 సినిమాలు 100రోజులు ఆడాయి. ఒకరోజు హైదరాబాద్ లోని శారదా స్టూడియోలో ‘పల్లెటూరి బావ’ అనే సినిమా జరుగుతుంది. ఆ సినిమాలో అన్నయ్య, రమాప్రభ, అక్కినేని నాగేశ్వరరావు, రేలంగి యాక్ట్ చేస్తున్నారు. ఆసినిమాలో అన్నయ్యకు బావమరిది వేషం నన్ను చేయమన్నారు.
నేను చేయనని చెప్పాను. నాకు సినిమాలో నటించాలని కోరిక ఉండేది కాదు. బి.కామ్ చదివి బ్యాంకులో జాబ్ చేయాలని ఉండేది. అన్నయ్య నన్ను బలవంతంగా ఒప్పించారు. ఆ సినిమాలో నేను రిక్షావాడి వేషం వేసాను. ఆ సినిమాకు నాకు మంచి పేరు వచ్చింది. ఆతర్వాత నాకు ‘మరుపురాని మనిషి’ చిత్రంలో అన్నయ్యకు కొడుకుగా అవకాశం వచ్చింది. ఆ సినిమాకు కూడా మంచి గుర్తింపు వచ్చింది.
* ఈ రెండు సినిమాలు తర్వాత ఇంకో రెండు సినిమాలు చేసి తర్వాత బి.కామ్ పూర్తి చేసేవరకు సినిమాలు చేయనని చెప్పేసాను. బి.కామ్ పూర్తి చేసి బ్యాంకు జాబ్ కోసం ట్రై చేశాను రికమండేషన్ లేక ఆ జాబ్ రాలేదు. ఆతర్వార మరల సినిమాలోకి వచ్చాను. నేను మూడు తరాల హీరోలతో నటించాను. నేను చుసిన మూడు తరాల నటులలో నందమూరి తారక రామారావు, బాలకృష్ణ, jr. ఎన్టీఆర్ మంచి నటులు. అందరికి దేవుడు నటించే వరం ఇవ్వడు. కానీ తాటాకు, కొడుకుకు, మనవడికి ముగ్గురికి దేవుడు నటించే వరం ఇచ్చాడు. ముగ్గురు ముగ్గరే. గొప్ప నటులు. నాకు సంతానం ఒక పాపా, అన్నయ్యకు ఇద్దరు కొడుకులు. వారికి నటులు అవ్వాలని లేదు.
అన్నయ్య పిల్లలు మంచి సాఫ్ట్ వెర్ కంపెనీ పెట్టి అమెరికాలో స్థిరపడ్డారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం అకాల మరణం నన్ను చాలా బాధించింది. నాకు ఆయనతో మంచి అనుభందం ఉంది. రాజబాబు, బాలసుబ్రమణ్యం కూడా మంచి స్నేహితులు. అన్నయ్య రాజబాబుకు బాలసుబ్రమణ్యం ఎన్నో పాటలు పాడారు. అన్నయ్య 47వ ఏళ్ళ వయసులో చనిపోయారు. అప్పటి వరకు నాకు అన్నయ్యే అన్ని అనుకున్నాను. అన్నయ్య చనిపోయిన తర్వాత గుండె రాయచేసుకున్నాను. అన్నయ్య తర్వాత నేనే ఇంటికి పెద్దవాడిని.
* అమ్మానాన్నలను చూసుకోవాలి, తమ్ముళ్లను, అక్కచెల్లెలను చూసుకోవాలి, అన్నయ్య పిల్లల బాధ్యత తీసుకోవాలి ఇదే నా మనసులో ఉండేది. ఇప్పటికి అన్నయ్య చనిపోయి 28ఏళ్ళు అయింది. ఏ స్టూడియో దగ్గరకు వెళ్లినా రాజబాబు దేవుడు అని అంటారు. అన్నయ్య అంత కాకపోయినా నేను కూడా దానధర్మాలు చేస్తాను. ఈ దానధర్మాలు మనం చనిపోయేటప్పుడు ప్రశాంతంగా చనిపోవడానికి మాత్రమే. నా జీవితంలో మహా కవి శ్రీశ్రీగారితో గడిపిన రోజులు నాకు ఇప్పటికి బాగా గుర్తుండిపోతాయి.
* అన్నయ్య, శ్రీశ్రీగారు మంచి స్నేహితులు. అన్నయ్య దయవల్ల నేను కూడా ఆ మహానుభావుడితో సాన్నిహిత్యంగా ఉండేవాడిని. కొంతమంది నన్ను అన్నయ్యగారి బయోపిక్ తీయమని అడుగుతున్నారు. మా వదిన, వారి పిల్లల పర్మిషన్ తీసుకోని మంచి ఆర్టిస్టులను పెట్టి సినిమా తీస్తాను. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఈలోపు అన్నయ పేరు మీద ఒక బ్యానర్ ప్రారంభించి ఒక మంచి కామెడీ సినిమా తీయాలని ఆలోచిస్తున్నాను. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 10న ఆ సినిమా విశేషాలు చెపుతానని అంటూ చిట్టిబాబు తన మనసులోని మాటలను బయటపెట్టారు.