ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన దివ్య తేజస్విని కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో నిందితుడైన నాగేంద్ర- దివ్య కు సంబంధించిన ఫోన్ కాల్స్ సంభాషణ కీలకంగా మారాయి. మరో వైపు నాగేంద్ర తేజస్విని కలిసి ఉన్న కొన్ని చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని అన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసిందే.
బాధితురాలి ఇంటికి వెళ్లిన హోంమంత్రి
కాగా బాధితురాలి తల్లిదండ్రులను పరామర్శించడానికి రెండు రోజుల క్రితం వారి ఇంటికి వెళ్లిన హోంమంత్రి మేకతోటి సుచరితను వారు నిందితుణ్ని కఠినంగా శిక్షించాలంటూ కోరారు. సీఎం జగన్ ను తాము కలిసే విధంగా అవకాశం కల్పించాలంటూ వారు హోంమంత్రిని అభ్యర్థించారు. మంగళవారం మధ్యాహ్నం దివ్య తల్లిదండ్రులు హోంమంత్రి సమక్షంలో సీఎంను కలిసేందుకు ఆమె ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఆమె పై వారి అభిప్రాయం ఏంటో మరి..
స్వయంగా రాష్ట్ర హోంమంత్రే బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించినప్పటికీ వారు ముఖ్యమంత్రిని కలవాలని అభ్యర్థించారు అంటే వారికి హోమంత్రి మీద ఎటువంటి నమ్మకం లేదనే తెలుస్తుంది. కేవలం నామ మాత్రంగా మాత్రమే ఆమెను హోంమంత్రిగా భావిస్తున్నట్లు దీని ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకుని హోంమంత్రి చేతిలో ఎటువంటి అధికారాలు ఉండవనే అభిప్రాయం వారిలో కలిగి ఉండొచ్చు.
ఆ కేసులో ఎటువంటి పురోగతి లేదు.. మరి దీనిలో..
గతంలో సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కూడా ముఖ్యమంత్రిని కలిసి వారి గోడును తెలిపారు. ఆయన కేసును సీబీఐకి అప్పగించేసి చేతులు దులుపేసుకున్నారు.ఇప్పటి వరకు ఆ కేసులో ఎటువంటి పురోగతి లేదు. దాంతో వారు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ నిర్భయ కేసును వాదించిన న్యాయవాది సీమాను కలిసారు. దాంతో ఆమె సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్నట్లు తెలిపారు.
ఇప్పుడు దివ్య తేజస్విని తల్లిదండ్రులు కూడా ముఖ్యమంత్రిని కలిసి తమ బాధను చెప్పుకోవాలనుకుంటున్నారు. ఈ కేసులోనైనా ముఖ్యమంత్రి స్పందించి త్వరితగతిన పూర్తి చేస్తారేమో చూడలి.











