తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల విషయంలో వైసీపీ సర్కారుకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రెండు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఇప్పటికే కలెక్టర్లకు అందడంతో చర్యలూ ప్రారంభమయ్యాయి. ఈ రెండు అంశాల్లో టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదులే కారణంగా తెలుస్తోంది. వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలని, కేంద్ర బలగాలతో ఎన్నికలు జరిపించాలని, ఏవేని రెండు గుర్తింపు కార్డులు చూపిస్తేనే ఓటుకు అవకాశం ఇవ్వాలని , చంద్రబాబుపై రాళ్లదాడి ఘటనపై దర్యాప్తు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఎన్నికల్లో వలంటీర్లను దూరంగా ఉంచాలంటూ..
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో వలంటీర్లను దూరంగా ఉంచాలని టీడీపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. గతంలో జరిగి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో డిమాండ్ చేసినా..పూర్తి స్థాయిలో వలంటీర్లను దూరం పెట్టలేదు. దీంతో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో టీడీపీ నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్ తదితరులు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. కాగా ఈ లేఖలపై స్పందించిన ఎన్నికల సంఘం కార్యదర్శి అవినాశ్ కుమార్ సమాధానమిచ్చారు. వలంటీర్లను తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలకు దూరంగా ఉంచేందుకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. వలంటీర్లు ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకోకూడదని, ఏంజెట్లుగా కూడా ఉండరాదని ఆదేశాలు జారీ చేశామన్నారు. సున్నితమైన, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అత్యధిక శాతం కేంద్ర సాయుధ బలగాల పహారా ఉంటుందని చెబుతూ సమాధానం పంపారు.

పోలీస్ పరిశీలకునిగా సీనియర్ ఐపీఎస్ అధికారి
ఇక గత సోమవారం చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో రాళ్లదాడి జరిగిందని టీడీపీ చెబుతోంది. సభలోనే చంద్రబాబు రాయిని కూడా చూపించారు. అయితే అధికార వైసీపీ దీనిపై ప్రతివిమర్శకు దిగింది. రాళ్లదాడి చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. హోంమంత్రి సుచరితతో పాటు తిరుపతి రేంజ్ డీఐజీ కూడా రాళ్లదాడి జరగలేదని చెప్పారు. టీడీపీ వద్ద ఆధారాలుంటే వెంటనే ఇవ్వాలని నోటీసులూ జరీ చేశారు. దీంతో ఈ అంశంపై దర్యాప్తునకు ఆదేశించాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఎంపీలు,నేతలు లేఖలు రాశారు. ఈ అంశంపైనా ఎన్నికల సంఘం స్పందిస్తూ.. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, దర్యాప్తు జరుగుతోందని, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత వాతావరణంలో జరిగేలా సీనియర్ ఐపీఎస్ అధికారిని పోలీస్ పరిశీలకునిగా నియమించినట్టు తెలిపింది. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులకు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామని వెల్లడించింది. మొత్తం 2470 ఎన్నికల కేంద్రాలకు గాను 1241 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరుగుతుందని, 315మంది వీడియోగ్రాఫర్లు మరియు 816 మైక్రో అబ్జర్వర్ల నియామకం జరిగిందన్నారు.
కాగా తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో 2.5 లక్షల మంది దొంగ ఓటరు కార్డులను వైసీపీ తయారు చేయించిందని ఇప్పటికే టీడీపీ, బీజేపీలు ఆరోపిస్తున్నాయి. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి కూడా. అయితే దీనిపై ఇంకా ఎన్నికల సంఘం స్పందించాల్సి ఉంది. ఈ ఫిర్యాదును పరిణగణలోకి తీసుకుంటే.. ఓటర్లు ఏవేని రెండు గుర్తింపు కార్డులు చూపిస్తేనే ఓటు వేసేందుకు ఆదేశాలు జారీ కావచ్చు.
పది మంది వలంటీర్లపై చర్యలు..
కాగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచినట్టు తిరుపతి కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఏజెంట్లుగా కూడా వలంటీర్లు పనిచేయకూడదని, ఎన్నికల విధుల్లో పాల్గొన్న వలంటీర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 10మంది వలంటీర్లపై చర్యలు తీసుకున్నామన్నారు
Also Read:జగన్ బెయిల్ రద్దు పిటిషిన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు











