ఏపీలో వైన్ షాపుల్లో కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేస్తున్న వ్యవహారం వెలగపూడి సచివాలయంలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వమే వైస్ షాపులు ఏర్పాటు చేసింది. వీటి పర్యవేక్షణకు కాంట్రాక్టు ఉద్యోగులను నియమించుకున్నారు. రెండు సంవత్సరాల కాంట్రాక్టుతో వేలాది మందిని తీసుకున్నారు. ఇప్పటికే ఒకటిన్నర సంవత్సరం పూర్తి అయిపోయింది. మరో ఆరు నెలల్లో వారి కాంట్రాక్టు పూర్తవుతుంది. మరలా రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంది.
ఇక దొరికిందే చాన్సుగా దోపిడీకి తెరలేపారు. వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగుల నుంచి రూ.8 కోట్లు దండుకున్నారు. తీరా మీడియాలో వార్తలు హల్ చల్ చేయడంతో, ఏంటీ ఇలా జరుగుతోందా? అంటూ మొద్దు నిద్ర నటించిన అధికారులు, తాజాగా విచారణకు ఆదేశించారు.
అసలేం జరిగింది
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి వరకూ ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న వైన్ షాపులను రద్దు చేసింది. ప్రభుత్వమే కేరళ తరహాలో వైన్ షాపులను ప్రారంభించింది. తొలుత 3250 షాపులు పెట్టారు. వాటిల్లో పనిచేసేందుకు ఒక్కో వైన్ షాపునకు ముగ్గురు చొప్పున వైసీపీ కార్యకర్తలను నియమించుకున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పదివేల మందిని తీసుకున్నారు. వీరి నుంచి ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి 3 లక్షలదాకా లంచాలు వసూలు చేసుకున్నారని అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.
అయితే ఏడాది తరవాత మద్యనిషేధంలో భాగంగా అంటూ 20 శాతం షాపులను తగ్గించారు. అప్పుడు షాపుల సంఖ్య 2,850కు తగ్గిపోయింది. దీంతో దాదాపు 1800 మంది కాంట్రాక్టు ఉద్యోగులు రోడ్డునపడ్డారు. తాజాగా మరో కుంభకోణానికి తెరలేపారు. వైన్ షాపుల్లో పనిచేసేందుకు రెండు సంవత్సరాల అగ్రిమెంట్‌తో కాంట్రాక్టు ఉద్యోగులుగా తీసుకున్నారు. మరో ఆరునెలల్లో కాంట్రాక్టు ముగియనుంది. వారంతా రెన్యువల్ చేయించుకోవాలంటూ కాంట్రాక్టు సంస్థ రెడ్డి ఎంటర్ ప్రైజెస్ అవుట్ సోర్సింగ్ ఏజన్సీ ఆదేశించింది. అంతేకాదు, ఒక్కో కాంట్రాక్టు ఉద్యోగి రూ.7,500 చెల్లిస్తేనే రెన్యువల్ చేస్తామంటూ భారీగా వసూళ్లకు దిగారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రూ.8 కోట్లు దండుకున్నారు. వ్యవహారం పత్రికల్లో రావడంతో, ఏమీ తెలియనట్టు నటించిన అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
పెద్దల హస్తం లేకుండా జరుగుతుందా?
ప్రభుత్వానికి కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను అందించే ఏజన్సీలన్నీ మంత్రుల కనుసన్నల్లో నడుస్తున్నాయనేది జగమెరిగిన సత్యమే. అలా పుట్టిందే రెడ్డి ఎంటర్‌ప్రైజెస్. వైన్ షాపుల్లో పని చేసే 8 వేల మంది సిబ్బందికి ఈ సంస్థ ద్వారా నియమించుకున్నారు. తాజాగా రెన్యువల్ పేరుతో ఒక్కో ఉద్యోగి నుంచి రూ.7,500 చొప్పున మొత్తం రూ.8 కోట్ల వరకూ వసూలు చేశారు. ఇదంతా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులకు, వైసీపీ పెద్దలకు తెలియకుండా జరుగుతుందా? పెద్దల అండ లేకుండా కేవలం ఓ కాంట్రాక్టు ఏజన్సీ ఇంత పెద్ద అవినీతికి తెరలేపుతుందా? అనే అనుమానాలు రాక మానవు. పెద్ద ఎత్తున వసూళ్లతో మీడియాలో వరుస కథనాలతో పరువు పోవడంతో అధికారులు విచారణకు ఆదేశించారు.
నిజమేనని తేల్చిన ఏపీబీసీఎల్
కాంట్రాక్టు ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున వసూళ్లు చేశారంటూ వచ్చిన వార్తలపై ఆంధ్రప్రదేశ్ బేవరేజస్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. ఈ వసూళ్ల వ్యవహారం నిజమేనని తేల్చారు. కాంట్రాక్టు ఉద్యోగుల వద్ద లంచాలు వసూలు చేస్తున్న వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
కార్పొరేషన్లో ఎందుకు చేర్చలేదంటే?
ఏపీలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ఏపీ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్లోకి తీసుకువచ్చారు. కానీ వైన్ షాపుల్లో పని చేస్తున్న వారిని మాత్రం కాంట్రాక్టు ఉద్యోగులుగానే పరిగణిస్తున్నారు. ఏటా 20 శాతం షాపులు మూసి వేస్తూ, ఐదేళ్లకు సంపూర్ణ మద్యం నిషేధం అమలు చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వీరిని అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్లోకి తీసుకుంటే వైన్ షాపులు మొత్తం మూసేసిన తరవాత కూడా వీరికి ఉద్యోగ భద్రత కల్పించాల్సి వస్తుందనే సాకుతో వీరిని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కాంట్రాక్టు ఉద్యోగులుగా తీసుకుంటున్నారని తెలుస్తోంది.
ఆ లాజిక్ బాగానే ఉంది గానీ.. కాంట్రాక్టును రెన్యువల్ చేసే ప్రతి సందర్భంలోనూ ఇలా వసూళ్ల దందాకు తెరలేపుతుంటారా? అనేది ప్రజల్లో కలుగుతున్న సందేహంగా ఉంది.











