లావణ్య త్రిపాఠి పేరు వినగానే ‘అందాల రాక్షసి’ సినిమా గుర్తుకు వస్తుంది. తొలి సినిమాతోనే ఆమె కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేసింది. నాజూకుదనానికి నమూనాగా నిలిచిన ఈ సుందరిని వరుస అవకాశాలు చుట్టముట్టడం ఖాయమని అంతా అనుకున్నారు. ఊహించినట్టుగానే ఈ అమ్మాయిని వెతుక్కుంటూ పెద్ద పెద్ద బ్యానర్ల నుంచి అవకాశాలు వచ్చాయి. గ్లామర్ పరంగా ఆకట్టుకుంటూ .. నటన పరంగా మెప్పించడానికి ప్రయత్నిస్తూ ఆమె ముందడుగు వేసింది.
అలా నానీ జోడీగా ఆమె చేసిన ‘భలే భలే మగాడివోయ్’ .. నాగార్జున సరసన చేసిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రాలు ఘన విజయాలను సాధించాయి. దాంతో లావణ్య త్రిపాఠి దశ తిరుగుతుందనీ, స్టార్ స్టేటస్ కోసం ట్రై చేసే హీరోయిన్స్ రేస్ లోకి ఆమె కూడా ఎంటర్ కావడం ఖాయమని చెప్పుకున్నారు. కానీ ఆ తరువాత లావణ్య త్రిపాఠి సరైన కథలను ఎంచుకోలేకపోయింది .. గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలేవో గ్రహించలేకపోయింది. ఈ క్రమంలో అల్లు శిరీష్ తో చేసిన ‘శ్రీరస్తు శుభమస్తు’ మినహా, మిగతా చిత్రాలన్నీ పరాజయాల దిశగా పరుగులు తీశాయి.
రామ్ జోడీగా చేసిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ .. శర్వానంద్ సరసన చేసిన ‘రాధ’ .. చైతూతో కలిసి చేసిన ‘యుద్ధం శరణం’ .. వరుణ్ తేజ్ కి నాయికగా చేసిన ‘మిస్టర్’ .. సాయిధరమ్ తేజ్ జోడీగా ఆడిపాడిన ‘ఇంటిలిజెంట్’ సినిమాలు సంఖ్యాపరంగా చెప్పుకోవడానికి తప్ప ఆమె కెరియర్ కి ఎంతమాత్రం హెల్ప్ కాలేకపోయాయి. విడుదల విషయంలో అనేకమార్లు వాయిదాపడుతూ వచ్చిన ‘అర్జున్ సురవరం’ మాత్రం లావణ్య త్రిపాఠికి ఊరటను ఇచ్చింది. క్రితం ఏడాది చివర్లో వచ్చిన ఈ సినిమా, ఆమెలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది.
ఈ నేపథ్యంలోనే కథలు .. పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ, గ్లామరస్ పాత్రలు చేయాలనే నిర్ణయానికి లావణ్య త్రిపాఠి వచ్చింది. గ్లామరస్ పాత్రలు చేయడానికి తాను సిద్ధమనీ, అలాంటి పాత్రలను పోషించడానికి తాను ఉత్సాహంగా వున్నానని కూడా స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించలేదుగానీ, ఆమె ఆ నిర్ణయాన్ని తీసుకునేసరికి ఆలస్యమైపోయిందనే అభిప్రాయాలు మాత్రం వినిపించాయి.
ప్రస్తుతం లావణ్య త్రిపాఠి చేతిలో రెండు సినిమాలు వున్నాయి. సందీప్ కిషన్ సరసన నాయికగా ఆమె చేస్తున్న ‘A1 ఎక్స్ ప్రెస్’ .. కార్తికేయ జోడీగా చేస్తున్న ‘చావుకబురు చల్లగా’ వచ్చే ఏడాది ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఈ రెండు సినిమాలపైనే లావణ్య త్రిపాఠి ఆశలు పెట్టుకుంది. ఈ రెండింటిలో ఒకటి హిట్ కొట్టినా చాలానే ఆలోచనలో వుంది. సమయం దొరికినప్పుడల్లా తెలుగులో కొన్ని కథలను వింటూనే, తమిళంలో అవకాశాల కోసం ఆమె గట్టి ప్రయత్నాలే చేస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే అక్కడ ఆమె ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి మరి.