అభ్యర్థులను గెలిపించుకోవడం అనేది ఎన్నికల పోలింగ్ దాకా పార్టీలకు ఉండే టెన్షన్. కౌంటింగ్ ముగిసిన తర్వాత.. వారు గెలవడం అనే ఆనందం ఎంతో సేపు ఉండదు. అక్కడినుంచి.. వారు పార్టీ ఫిరాయించి.. మరో పార్టీలోకి వెళ్లకుండా కాపాడుకోవడం ఎలా అనే కొత్త టెన్షన్ మొదలవుతుంది.
బీహార్లో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో.. కాంగ్రెస్ పార్టీలో భయం మొదలైంది. బీహార్ ఎన్నికల ఫలితాలు పోటాపోటీగా ఉన్నాయి. జేడీయూ, బీజేపీ కూటమి స్వల్ప ఆధిక్యంతో కొనసాగుతోంది. ఏక్షణంలో అయినా ఫలితాలు అటు ఇటు కావచ్చుననిపించే రీతిలో వెలువడుతున్నాయి.
ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ ముందు జాగ్రత్త పడుతోంది. తమ పార్టీ తరఫున గెలిచే అవకాశం ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులను హోటల్ మౌర్యకు తరలించింది. వీరిని పార్టీ ఫిరాయింపజేయడానికి ప్రలోభాలు మొదలవుతాయనే భయంతోనే ఇలా చేసినట్లు తెలుస్తోంది. సుమారు 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలతో బీహార్ కాంగ్రెస్ హోటల్ మౌర్యలో శిబిరం ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ కు అన్నీ చేదు అనుభవాలే..
మధ్యప్రదేశ్ లో కేవలం బీజేపీ వ్యూహాలు, కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడం వలన ఆ పార్టీ అధికారం కోల్పోయింది. రాజస్తాన్ లో చావుతప్పి కన్ను లొట్టపోయినట్టు అయింది. ఇప్పుడు బీహార్ వంతు. జేడీయూ కూటమి మ్యాజిక్ ఫిగర్ కు ముందు చతికిలపడినట్లయితే.. ఆ స్థానాలను భర్తీ చేయడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గేలం వేస్తారేమోనని వారు భయపడుతున్నారు. అందుకే ముందుగానే.. గెలిచిన తర్వాత.. క్యాంపుల దాకా ఆగే పరిస్థితి లేకుండా.. గెలిచే చాన్సున్న అందరినీ తరలిస్తున్నట్టు తెలుస్తోంది.
ఫలితాలు ఇలా..
బీహార్ లో ఎన్నికల ఫలితాలు పోటాపోటీగా సాగుతున్నాయి. 243 స్థఆనాలు ఉన్నబీహార్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో జేడీయూ-బీజేపీ క ూటమి 123 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి 106 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. చిరాగ్ పాశ్వాన్ కుచెందిన ఎల్జేపీ ఏడు స్థానాల్లో ముందంజలో ఉంది.