(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
అమరావతి రాజధానికోసం రైతన్నల దీక్షలు 250 రోజులకు చేరుతున్న సందర్భంగా.. లియోన్యూస్ ప్రతినిధి అక్కడి రైతుల్లో కొందరితో మాట్లాడారు. వారి గోడు తెలుసుకునే ప్రయత్నం చేశారు. హఠాత్తుగా రూపు మారిపోయిన వారి బతుకుల్లో అడుగడుగునా దైన్యం కనిపిస్తోంది. వారిమాటల్లోనే చూడండి…
చదువులకు ఫీజులు కట్టలేకపోతున్నాం : వందనాదేవి
మాది తుళ్లూరు గ్రామం. ఆరేళ్ల కిందటి వరకూ మేము ఇంట్లో నుంచి బయటకు రాకుండా బతికాం. రాజధానికి భూములిచ్చి 250 రోజులుగా రోడ్డున పడ్డాం. పిల్లల చదువులు అటకెక్కాయి. వారి ఫీజులు కూడా కట్టలేకపోతున్నాం. పంటలు లేవు, కొత్త ప్రభుత్వం కనీసం కౌలు కూడా చెల్లించడం లేదు. బతకడమే కష్టంగా మారిందంటూ తుళ్లూరు గ్రామానికి చెందిన మహిళా రైతు వందనాదేవి కన్నీటి పర్యంతం అయ్యారు.
పూలు పండించిన చోటే.. కన్నీళ్లు కారుస్తున్నాం : రామకృష్ణ
ఒకప్పుడు పూలు కూరగాయలు, అరటి పండించేవాడిని. ఏటా తక్కువలో తక్కువ 3 ఎకరాల్లో 9 లక్షల ఆదాయం వచ్చేది. రాజధానికి భూములిచ్చాక మా కుంటుంబం రోడ్డున పడిందని రాయపూడి గ్రామానికి చెందిన రైతు రామకృష్ణ వాపోయారు.
కూలికి వలసపోవాలన్నా డబ్బులేదు : ఏడుకొండలు
ఇది ఒక్క రామకృష్ణ, వందనాదేవి సమస్య కాదు. 29 గ్రామాల్లోని 40 వేల మంది రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. వారి సమస్యలు ఎంత వర్ణించినా తక్కువే. ఇక కూలీల పరిస్థితి మరీ దారునంగా తయారైంది. పనికి పిలిచేవారే లేదు. పనుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో రవాణా ఛార్జీలు 150 రూపాయల దాకా అవుతున్నాయని రాయపూడికి చెందిన మురికిపూడి ఏడుకొండలు వాపోయారు.