కొంత కాలంగా చర్చనీయాంశంగా ఉన్న విజయశాంతి బీజేపీలో చేరిక విషయం ఖరారైనట్టే తెలుస్తోంది. గతంలో బీజేపీలో ఉన్న రాములమ్మ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరి ఎంపీగా గెలుపొందారు. తరువాత ఆ పార్టీని కూడా వీడి కాంగ్రెస్‌లో చేరారు. గత అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఆమెకు ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ హోదా కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపక పోవడం, గెలిచిన వారు సైతం పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరి పోవడంతో ఈ లేడీ అమితాబ్ కూడా సైలెంట్ అయిపోయారు. అప్పుడప్పుడు ప్రెస్ నోట్‌లు విడుదల మినహా చాలా అరుదుగా ఆమె బయట కనిపించారు.
సంజయ్ పొగడ్తల వర్షం..
తాజాగా విజయశాంతి బీజేపీలో చేరతారన్న వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దసరా సందర్భంగా ఆమె ఇంటికే వెళ్ళడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నెల 10లోపు ముహూర్తం ఖరారు చేసుకుని చెబుతానని ఆమె చెప్పినట్టు సమాచారం. తాజాగా దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో సంజయ్ మీడియాతో మాట్లాడుతూ విజయశాంతిని పొగడ్తలతో ముంచెత్తారు. విజయశాంతి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని.. తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్‌లో చేరితే కేవలం ఎంపీ సీటు ఇచ్చి ఆ తరువాత ఆమెను విస్మరించడంతో పార్టీ వీడారని సంజయ్ అన్నారు. తెలంగాణ కోసం పార్లమెంట్‌లో చేసిన పోరాటం పూర్తిగా విజయశాంతికే దక్కుతుందని.. కేసీఆర్ ఏనాడు పార్లమెంట్‌లో కొట్లాడక పోయినా తెలంగాణ నినాదాన్ని బలంగా పార్లమెంట్‌లో వినిపించడంలో ఆమె సక్సెస్ అయ్యారని చెప్పుకొచ్చారు. దీంతో బీజేపీలో విజయశాంతికి డోర్లు ఓపెన్ చేసినట్టు చెప్పకనే చెప్పారు బండి సంజయ్.
విజయశాంతి రాక ఖరారైనట్టే..
విజయశాంతి చేరికను ఏకంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరోక్షంగా వెల్లడించడంతో ఇక పార్టీ కార్యాలయంలో ఆమె ఎప్పుడు అడుగుపెడుతుందా అని చూస్తున్నారు బీజేపీ కార్యకర్తలు. విజయశాంతి చేరికతో పార్టీకి మరింత బలం చూకూరుతుందని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ పట్ల ప్రజల్లో సానుకూల వాతావరణం ఏర్పడిన నేపథ్యంతో పాటు ఆ పార్టీ నేతలు బండి సంజయ్, డీకే అరుణ, కిషన్ రెడ్డి, అరవింద్ లాంటి వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక గళం బలంగా వినిపిస్తున్నారు. వీరికి తోడు కేసీఆర్‌ను అతి దగ్గర నుండి చూసి, ఆయనతో కొట్లాడి మరీ బయటకు వచ్చిన విజయశాంతి గళం కలిపితే టీఆర్ఎస్‌ను మరింత బలంగా ఢీ కొట్ట వచ్చన్న అభిప్రాయాన్ని పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.
బీజేపీలో చేరిన తరువాత విజయంశాంతికి ఎలాంటి బాధ్యతలు అప్పజెబుతారు.. ఆమె స్థానం ఏమిటన్న దానిపై పార్టీలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.