ఏపీ రెవెన్యూ, పంచాయతీ అధికారుల తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం తిరుమలాయపల్లిలో స్మశాన స్థలంలో సచివాలయం కట్టొద్దని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అదే స్థలంలో రైతు భరోసా కేంద్రం నిర్మాణం చేపడుతున్న రెవెన్యూ, పంచాయతీ అధికారుల తీరును ధర్మాసనం తప్పు పట్టింది. హైకోర్టు ఆదేశాలనే అపహాస్యం చేస్తారా అంటూ అధికారులపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టికల్ 215 ప్రకారం సుమోటోగా తీసుకుని అధికారులపై చర్యలు తీసుకుంటామని ధర్మాసనం హెచ్చరించింది. తీరు మార్చుకోకుంటే జైలుకు పంపుతామంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
మరో కేసులో..
యూనివర్శిటీల్లో పాలకమండలి నియామకాల తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రయోజనాల ఆధారంగానే యూనివర్శిటీ పాలకమండళ్లలో నియామకాలు చేస్తున్నారని న్యాయవాది శ్రావణ్ కుమార్ వేసిన పిల్ పై ధర్మాసనం స్పందించింది. యూనివర్శిటీ పాలకమండలి సభ్యులను ఎలాంటి నిబంధనల మేరకు నియమిస్తున్నారో పూర్తి సమాచారం ఇవ్వాలని ఉన్నత విద్యామండలి, ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది.