‘ఆదిపురుష్’ పేరుతో రామాయణంపై సినిమాను ప్రకటించి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సంచలనానికి తెరతీశారు. ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఇదే రామాయణాన్ని బాలీవుడ్ లో సినిమాగా తీసేందుకు నిర్మాత అల్లు అరవింద్ కూడా సన్నాహాలు చేస్తున్నారు. అందులో శ్రీరాముడిగా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా రూ. 500 కోట్ల బడ్జెట్ తో త్రీడీలో నిర్మించనున్నారు. అల్లు అరవింద్ నిర్మించే చిత్రానికి దర్శకుడిగా నితిష్ తివారి పేరు వినవచ్చింది. రామాయణం కథకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎవరు హీరో, ఎవరు విలన్ అని చెప్పటానికి కూడా వీలు లేని కథ ఇది. ఎందుకంటే శ్రీరాముడికి ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో, రావణాసురుడికి కూడా అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రభాస్, ఓమ్ రౌత్ లు ఈ సినిమాని ప్రకటించిన తర్వాత అల్లు అరవింద్ చేపట్టే ప్రాజెక్టు విషయం ఏమవుతుందన్నది ఓ ప్రశ్నగా కనిపిస్తోంది.
హృతిక్ ఇక్కడ రావణుడైతే అక్కటి మాటేమిటి?
‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ నటనా స్థాయి బాగా పెరిగిపోయింది. ‘ఆదిపురుష్’లో ఇతర తారాగణాన్ని ప్రకటించకపోయినా రావణాసురుడిగా హృతిక్ రోషన్ నటిస్తాడని సమాచారం. ఇదే హృతిక్ రోషన్ అరవింద్ రామాయణంలో శ్రీరాముడి పాత్రను పోషించాల్సి ఉంది. ఇది జీర్ణించుకోలేని అంశం. ఒక సినిమాలో రావణాసురుడిగా నటించిన వ్యక్తిని ఇంకో సినిమాలో శ్రీరాముడిగా ఎలా ఊహించుకోగలుగుతారన్న ఆలోచించాల్సిన అంశం. టి సిరీస్ సీఎండీ భూషణ్ కుమార్ నిర్మాత అధికారిక ప్రకటన రానే వచ్చింది. అయితే రావణాసురుడి పాత్రపై ఊహాగానాలే ఉన్నాయి.

అల్లు అరవింద్ రామాయణంలో సీతగా రాధికా ఆప్టే, రావణాసురుడిగా రజనీకాంత్, హనుమంతుడిగా సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ లక్ష్మణుడిగా, మేఘనాధుడిగా రణ్ వీర్ సింగ్, సుగ్రీవుడిగా ప్రభాస్, వాలిగా రాణా, కుంభకర్ణుడిగా సంజయ్ దత్, ధశరథుడిగా అమితాబ్, కైకేయిగా రేఖ, అంగదుడిగా వరుణ్ దావన్, విభీషణుడిగా అనిల్ కపూర్ , శుూర్పణక గా కంగనా రనౌత్ తదితర పేర్లు వినవచ్చాయి. ప్రభాస్ సినిమా తాజా ప్రకటన నేపథ్యంలో అల్లు అరవింద్ వైపు నుంచి కూడా ఓ ప్రకటన వస్తే స్పష్టత వస్తుంది. అరవింద్ నిర్మించే రామాయణం కు సంబంధించి స్క్రిప్టు వర్క్ చాలా వరకు జరిగింది. కరోనా కారణంగా ఆ ప్రెజెక్టు అటకెక్కితే ఈ ప్రెజెక్టు తెరపైకి వచ్చిందా అనే సందేహాలు ఉన్నాయి.
కరోనా కాలంలో ఈ ప్రకటన ఓ సంచలనం…
కరోనా కారణం చిత్ర పరిశ్రమ యావత్తూ స్తంభించి ఉంది. షూటింగులు ఎప్పుడు మొదలు పెడతారో తెలియదు. ఇలాంటి తరుణంలో హడావుడిగా ఈ ప్రకటన చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే సందేహాలు ఉన్నాయి. తన సినిమాపై హీరో ప్రభాస్ స్పందిస్తూ ‘ప్రతి పాత్ర, ప్రతి అవకాశం వెనుక ఎన్నో సవాళ్లుంటాయి. ఈ తరహా పాత్రను పోషించడం నాకెంతో గర్వకారణం. బాధ్యతగా చేయాల్సిన పాత్ర ఇది. ఈ పాత్రను పోషించేందుకు చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నా. పాత్రను ఓమ్ రౌత్ డిజైన్ చేసిన తీరు అద్భుతం’ అన్నారు. హిందీ, తెలుగు భాషల్లో నిర్మించే ఈ చిత్రాన్ని కన్నడ, మళయాళం, తమిళంలోకి అనువాదం చేయనున్నారు.
రామాయణం అంటేనే ప్రతి పాత్రకూ ప్రత్యేక ఔచిత్యం ఉంటుంది. ఇందులో నటించే ఇతర తారాగణం వివరాలను మాత్రం ఇంతవరకూ ప్రకటించలేదు. శ్రీరాముడు, రావణాసురుడు, హనుమంతుడు పాత్రలు ప్రధానంగా ఈ సినిమాలో హైలైట్ గా నిలిచే అవకాశం కనిపిస్తోంది. హనుమంతుడిగా సల్మాన్ ఖాన్ అయితేనే బాగుంటుందనే అభిప్రాయాలు చాలామందిలో ఉన్నాయి. కాకపోతే కథల కోసం కొత్తగా వెతికే ప్రయత్నాలు చేయకుండా ఉన్న కథలతోనే భారీ చిత్రాలు నిర్మించే ప్రయత్నాలో బాలీవుడ్ అన్నట్లు అర్థమవుతోంది. ఇప్పటిదాకా బయోపిక్ లే అనుకుంటే వాటికి తోడు ఇప్పుడు పురాణ కథల మీద కూడా బాలీవుడ్ దృష్టిపడింది. ఇప్పుడున్న టెక్నాలజీతో బాహుబలిని మించి వీటిని తెరకెక్కించవచ్చన్న అభిప్రాయంతోనే ఈ ప్రాజెక్టులను తెరపైకి తెస్తున్నట్లు సమాచారం.











