కేసీఆర్ అండదండలు ఉండటంతోనే ఏపీ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆరోపించారు. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులలో భారీ ఎత్తున ముడుపులు వస్తుండటంతో కేసిఆర్ నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారని ఆరోపించారు. కేసిఆర్ అండదండలు లేకపోతే జగన్ పోతిరెడ్డి పాడు జీవో విడుదల చేసేవాడా? అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రానికి కాపలాగా ఉండాల్సిన వ్యక్తి దొంగగా మారారని కేసిఆర్ తీరును రేవంత్ ఎండగట్టారు. ప్రైవేట్ విద్యుత్ సంస్థల వద్ద అధిక ధరకు విద్యుత్‌ను కొనడానికి కేసీఆర్ ప్రణాళికలు రచించారని రేవంత్ ఆరోపించారు. కమీషన్లకు కక్కుర్తిపడి దక్షిణ తెలంగాణను ఎడారిగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. ‘మేఘ’ కృష్ణారెడ్డి కోసమే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని 20వ తేదీ తర్వాత నిర్వహించాలని కేసీఆర్ కోరారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాజెక్టును ‘మేఘ’ గ్రూపుకే ఎందుకు ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశంను కలిసి వినతిపత్రం ఇచ్చారు. జీవో 69 ద్వారా మంజూరు చేసిన నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను అపెక్స్ కౌన్సిల్ అజెండాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. అపెక్స్ కౌన్సిల్ అజెండాలో జీవో 69ను చేర్చకపోతే కోర్టుకెళ్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఓ లేఖను విడుదల చేశారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో అన్నీ అనుమతులు పొంది, ఎలాంటి వివాదాలకు తావు లేని, నికర జలాలతో కూడిన, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలకు నీళ్లు ఇవ్వగలిగే నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్టును తొక్కి పెట్టడం ద్వారా మీరు సాధించింది ఏమిటి? ఆ ప్రాంత ప్రజలకు మీరు దోహం చేసినట్లు కాదా? తాజాగా అపెక్స్ కౌన్సిల్ అజెండాలో కాని సుప్రీంలో మీరు చేసిన ఫిర్యాదులలో కానీ ఈ ప్రాజెక్ట్ విషయాన్ని ప్రస్తావించకపోవడం దారుణమని’ ఆయన మండిపడ్డారు.
‘రాష్ట్ర విభజన చట్ట పరిధిలోకి రాని ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలి. కేవలం 1450 కోట్లతో 1.07 లక్షల ఎకరాలకు సాగునీరు, మార్గమధ్యంలో ప్రజలకు తాగు నీరు ఇచ్చే ఈ ప్రాజెక్టు పనులను తక్షణమే చేపట్టాలి. లేని పక్షంలో రైతులు,ఆ ప్రాంత ప్రజలతో కలిసి పోరాటానికి సిద్ధం కావాల్సి ఉంటోంది’ అంటూ హెచ్చరిస్తూ ఓ లేఖను వ్రాశారు. ఈ నేపథ్యంలో అందరి ద్రుష్టి ఆగస్ట్ 25న జరగనున్న అపెక్స్ మీటింగ్ పై పడింది. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంపు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం తమ అభ్యంతరాలను తెలిపింది. రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడ్డ వివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం అపెక్స్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అపెక్స్ సమావేశాన్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వాగతించారు.











