మీడియా ఛానళ్ల మధ్య పోటీ సహజం. తాము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలకు మంచి టీఆర్పీ దక్కాలని ప్రతి ఛానల్ కోరుకొంటోంది. కానీ అందుకు భిన్నంగా ఎన్టీవీ-టీవీ5 ఛానెళ్ల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. ఒకరిపై ఒక్కరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అనకొండ కబ్జాలో జూబ్లీహిల్స్ సొసైటీ అంటూ టీవీ5 రిలీజ్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. సొసైటీకి గృహ నిర్మాణాలు చేపడతామని భారీ ఎత్తున స్కాం జరిగిందని ఆరోపణలు ఆ వీడియోలో ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో రగిలిపోయిన ఎన్టీవీ యాజమాన్యం టీవీ5 గుట్టు ఇదేనంటూ వరుస వీడియోలను విడుదల చేసింది.
‘ఒక నాయుడు వంద లీలలు’ పేరిట టీవీ5 అధినేతను ప్రశ్నించింది. న్యూజెన్ ఆయిల్ పేరిట ఆముదాన్ని నమ్మి ప్రజల సొమ్మును స్వాహా చేశారని ఆరోపణలు చేశారు. మోకాలికి బోడిగుండుకు కలిపి చీటింగ్ చేశారని ఆ ప్రోమోలలో ఉంది. ప్రోమోలలోనే యుద్ధం మొదలైతే అసలు కథనాలు ఎలా ఉంటాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఏమైందో ఏమో తెలియదు గానీ వీరిద్దరి మధ్య కాల్పుల విరమణ జరిగిపోయింది. భారీ ఎత్తున విమర్శలు చేస్తూ ప్రోమోల మీద ప్రోమోలు విడుదల చేసిన ఆయా ఛానళ్ళు ఆ వీడియోలను ప్రైవేట్ చేసేశాయి. గట్టిగా 24 గంటలు గడవక ముందే ఆ వీడియోలను తొలగించడంపై రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చకు దారి తీసింది.
ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ రెండు ఛానళ్ళు రాజీకి వచ్చేసాయంటూ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. అసలు ఈ గొడవకు టీవీ5 ఎందుకు బీజమేసింది? అనే విషయంపై ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి వినబడుతోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కొన్ని రోజుల కిందట ఎన్టీవీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డపై ఓ కథనాన్ని ప్రసారం చేసింది. ఈ కథనంలో నిమ్మగడ్డ సాధించింది ఏంటి? అంటూ ప్రశ్నించింది. ఈ ప్రోగ్రాం ఏపీలో అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగా ఉంది. ఈ విషయం టీవీ5కి కోపానికి కారణమైందని తెలుస్తోంది. అందుకే జూబ్లీహిల్స్ సొసైటీ అక్రమాలు అంటూ ఎన్టీవీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిందనే వార్తలు వినబడ్డాయి. మొత్తం మీద ఈ ఛానెళ్ల కాల్పుల విరమణ చేయడంతో అసలు విషయాలు మాత్రం బయటికి రాలేదనే చెప్పాలి.











