ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ కరోనా టీకా ఎప్పుడొస్తుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ సరఫరా కోసం కేంద్రం, రాష్ట్రాలు సన్నాహాలు ముమ్మరంగా చేస్తున్నారు. అందులో ఎలా నమోదు చేసుకోవాలి, ఎవరు అర్హులు వంటి మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేసింది. వీటితోపాటు వ్యాక్సినేషన్ కేంద్రాలు, వ్యాక్సిన్ వేయడానికి కొందరికి శిక్షణ ఇవ్వడం వంటి వాటి విషయంలో అన్ని రకాలుగా ఏర్పాట్లు పూర్తిచేస్తుంది. టీకాలు సిరంజిలు, టీకా సీసాలు.. ఇలా అన్నింటికోసం ఆర్డర్లు కూడా ఇస్తుంది. ఇదంతా చూస్తుంటే.. వ్యాక్సిన్ తొందరలో ఉంటుందనే విషయం అర్ధమవుతున్నా కూడా.. ఎప్పుడు అనేది మాత్రం స్పష్టత రావడం లేదు.
జనవరిలో వ్యాక్సినేషన్?
ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వ్యాఖ్యల ప్రకారం.. జనవరిలో వ్యాక్సినేషన్ మొదలుపెట్టడానికి కేంద్రం సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. కానీ, వాటి సామర్థ్యం, రక్షణ విషయంలో కేంద్రం ప్రాధాన్యం ఇస్తుందని.. ఆ విషయాలలో కేంద్రం అంచనాలను అందుకున్న వ్యాక్సిన్లకు మాత్రమే కేంద్రం అత్యవసరం అనుమతుల అందించే అవకాశాలు ఉంటాయని మంత్రి తెలియజేశారు. దేశంలో నుండి కరోనా నిర్మూలించడమే కేంద్రం లక్ష్యమని, అందుకోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని చెప్పుకొచ్చారు.
అత్యుత్తమమైన టీకానే ప్రజలకు అందించాలనేది కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి చెప్పుకొచ్చారు. రానున్న తొలి దశలో 30 కోట్లమందికి 6-7 నెలల్లో పూర్తి చేయాలని కేంద్రం టార్గెట్ పెట్టుకున్నట్లు మంత్రి మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. భారత్‌లో మొత్తంగా 9 వ్యాక్సిన్లు తయారీ దశలో ఉన్నాయని, అందులో 6 క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయని, ఇక మిగిలిన 3 ప్రీ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయని మంత్రి వ్యాక్సిన్ లెక్కల్ని దేశ ప్రజలకు తెలియజేశారు.
తెలంగాణలో 75 లక్షల టీకాలు
తెలంగాణలో తొలి దశలో 75 లక్షల టీకాలు అందించాలనేది ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో వైద్యులు, కరోనా వారియర్స్, పోలీసులు, హెల్త్ సిబ్బంది, 50 ఏళ్లు పైబడిన వారు, వయస్సుతో సంబంధం లేకుండా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారిని ఈ జాబితాలో చేర్చనున్నట్లు తెలుస్తుంది. వీరికి 48 గంటల్లో టీకా రెండు డోసులు అందించాలనేది లక్ష్యమని, ఆ తర్వాత వారి ఆరోగ్యం పరివేక్షణలో ఉండాలని, ఎప్పటికప్పుడు వారి సైడ్ఎఫెక్స్, ఆరోగ్య స్థితి నమోదు చేయడం వల్ల తర్వాతి కాలంలో కరోనా వ్యాక్సినేషన్‌కు ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు.
ఇందుకోసం సమాచారం సేకరించడం సవాలు కూడుకున్న పనైనా.. రాష్ట్రం సమాచారం కోసం ప్రత్యేకంగా కసరత్తు చేస్తుందని అధికారులు తెలియపరిచారు. వ్యాక్సినేషన్ అందివ్వడానికి ఏకకాలంలో 10 వేల కేంద్రాల్లో.. 10 వేల మంది బృందం వ్యాక్సినేషన్ అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇలా రోజుకు 80 నుండి 100 మందికి వేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తుంది. మొత్తంగా 75 లక్షల తొలి డోసులు అందివ్వడానికి 8-10 రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇదే తరహాలో రెండో రోసు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అందివ్వాలని రాష్ట్రం సన్నాహాలు చేస్తుంది.
ఒకవేళ వ్యాక్సినేషన్ సమయంలో ఏవైనా అనుకోని ఆరోగ్య సమస్యలు ఎదురవడం లాంటివి జరిగినా.. వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం 10 వేల కిట్లను సిద్ధం చేస్తుంది. దాదాపు 50 వేల సిబ్బంది వ్యాక్సినేషన్ శిక్షణ ఇస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. అత్యవసర, అవసరమైన చికిత్సలు అందించడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలల్లో 60 స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను సిద్ధంగా ఉంచింది ప్రభుత్వం. టీకాపై అనుమానాలు నివృత్తికొరకు, సందేహాలు అడగడానికి తొందరలో ఒక ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తేనున్నట్లు చెప్పుకొచ్చింది ప్రభుత్వం.