ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 4,38,000లకు చేరింది. ప్రతిరోజూ కనీసం పది వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. సగటున ప్రతి రోజూ 80 మంది చనిపోతున్నారని వైద్య ఆరోగ్యశాఖ అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 3,17,000 మంది కోలుకున్నారు.
లక్ష మంది చికిత్స పొందుతున్నారు. అయితే వైద్య, ఆరోగ్య శాఖ కేవలం కరోనా టెస్టులకు పరిమితం అవుతోంది. కరోనా పాజిటివ్ వచ్చిన రోగులను పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా ఆ శాఖ నిర్వహించిన ఐవీఆర్ఎస్ లోనే ఈ విషయం వెల్లడైంది.
కరోనా బాధితులను గాలికొదిలేసిందా?
అవుననే అంటున్నారు కోవిడ్ బాధితులు. కరోనా పాజిటివ్ వచ్చినా ఇంటి దగ్గర ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందేందుకు ప్రభుత్వం అంగీకరిస్తోంది. అయితే వారికి కనీస చికిత్స ఇవ్వకపోగా, సలహాలు కూడా ఇవ్వడం లేదని బాధితులే స్వయంగా ఇంటిగ్రేటెడ్ వాయిస్ రెస్పాన్సు సిస్టమ్ ( ఐవీఆర్ఎస్) లో వెల్లడించారు. విశాఖపట్నం, చిత్తూరు, విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో సగానికిపైగా బాధితులు తమను కనీసం పట్టించుకోలేదని, డాక్టర్లు ఫోన్ కూడా చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ఇంటి వద్దే ఉండి చికిత్స పొందే కరోనా రోగులకు కనీసం టాబ్లెట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఆరెంపీ డాక్టర్లు చెలరేగిపోతున్నారు. ఇది అనేక అనర్దాలకు దారితీస్తోంది. కనీస జాగ్రత్తలు పాటించకుండా ఆరెంపీలు వైద్యం చేయడంతో అనేక మందికి కరోనా సోకుతోంది. కృష్ణా జిల్లా పామర్రులో ఓ ఆరెంపీ డాక్టర్ ద్వారా 40 మందికి కరోనా సోకిందని నిర్దరణ అయింది. చివరకు కరోనాతో ఆ ఆరెంపీ డాక్టర్ కూడా చనిపోయాడు. ఇంత జరుగుతున్నా గ్రామీణ ప్రాంతాల్లోని కరోనా రోగులకు ప్రభుత్వం అసలే పట్టించుకోవడం మానేసిందనే విమర్శలు వస్తున్నాయి. కేవలం టెస్టులు మాత్రమే నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తున్నారు.
నెలాఖరుకు ఏపీలో పది లక్షల కరోనా కేసులు
ఇదే పరిస్థితి కొనసాగితే ఏపీలో సెప్టెంబరు నెలాఖరుకు పది లక్షల కరోనా కేసులు నమోదు అవుతాయని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ప్రతి రోజూ 70 టెస్టుల కెపాసిటీ మాత్రమే ఉంది. అందుకే నిలకడగా పది వేల కరోనా కేసులు వస్తున్నాయని డాక్టర్లు అభిప్రాయపడ్డారు. టెస్టులు పెంచితే కరోనా కేసులు భారీగా బయటపడే అవకాశం ఉందని వారంటున్నారు. ఇప్పటికే అనేక రంగాలు కరోనా దెబ్బకు కుదేలయ్యాయి. ఏపీ ప్రభుత్వ ఆదాయం కూడా దారుణంగా పడిపోయిందని స్వయంగా బుధవారం జరిగిన ఓ సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్తే రాష్ట్రాన్ని ఆదుకుంటోంది. వ్యవసాయ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దీంతో పట్టణ ప్రాంతాలకన్నా గ్రామీణ ప్రాంతాల నుంచే ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా విజృంభిస్తే ఇక ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యే ప్రమాదం ఉంది. ఇకనైనా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టడికి పటిష్ఠ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.