ఏపీలో కరోనా రోగుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇప్పటి వరకు కరోనా రోగుల కోసం ఇంజనీరింగ్ కాలేజీలు, ట్రిబుల్ ఐటీలను వాడుకున్న వైద్య ఆరోగ్య శాఖకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. 9,10 తరగతులతోపాటు, కాలేజీలు కూడా ప్రారంభం కావడంతో కరోనా రోగులను ఖాళీ చేయించారు. వారికి ఎక్కడ వసతి కల్పించాలో అధికారులకు అర్థం కావడం లేదు. అందుకే ప్రతి మండలంలో కళ్యాణ మండపాలను కరోనా సెంటర్లుగా మార్చాలని నిర్ణయించారని తెలుస్తోంది.
హోం క్వారంటైన్ తో మరింత వ్యాపిస్తోన్న కరోనా…
ఏపీలో కరోనా రోగుల సంఖ్య ఆరున్నర లక్షలు దాటిపోయింది. ప్రతి రోజూ అదనంగా 7 వేల కొత్త కేసులు వస్తున్నాయి. వైద్యఆరోగ్య శాఖ కూడా కరోనా టెస్టులు 30 శాతం తగ్గించింది. ఆ మేరకు కరోనా కేసులు కూడా తగ్గాయి. పది రోజుల కిందటి వరకూ రోజుకు 70 వేల కరోనా టెస్టులు చేసేవారు. తాజాగా రోజుకు 50 వేల కరోనా టెస్టులు మాత్రమే చేస్తున్నారు. దీంతో కరోనా కేసుల సంఖ్య రోజుకు 10 వేల నుంచి 7 వేలకు తగ్గాయని తెలుస్తోంది. కరోనా పాజిటివ్ వచ్చినా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. హోం క్వారంటైన్ పేరుతో ఎవరి ఇంట్లో వారినే ఉంచుతున్నారు.
కనీసం మెడికల్ కిట్లు కూడా అందించడం లేదని ఒంగోలుకు చెందిన కొందరు కరోనా రోగులు వాపోయారు. ఒంగోలు పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఓ గ్రామంలో ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. హోం క్వారంటైనే చేసి సీ విటమిన్ టాబ్లెట్లు అందించారని రోగులు చెబుతున్నారు. తరవాత 20 రోజుల తరవాత మరోసారి టెస్ట్ చేయగా కరోనా నెగటివ్ వచ్చింది. దీంతో కరోనా తగ్గిపోయిందని వారంతా సంతోషించారు. మరో వారం తరవాత వారిలో ఒకరికి జ్వరం, జలుబు రావడంతో అనుమానంతో కరోనా టెస్టులు చేయించగా మరలా కరోనా పాజిటివ్ వచ్చింది.
దీంతో అసలు ప్రభుత్వం ఇచ్చే సీ విటమిన్ గోళీలతో కరోనా తగ్గిందా లేదా అనే అనుమానం వస్తోందని పేరు చెప్పడానికి ఇష్టపడి కరోనా రోగులు వాపోతున్నారు. ఇరుకు ఇళ్లల్లో హోం క్వారంటైన్ వల్ల ఇంట్లో ఒకరికి కరోనా వస్తే అందరికీ సోకుతోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఏపీలో కరోనాతో సహజీవనం ప్రారంభం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగానే ఏపీలో జనం కరోనాతో సహజీవనం చేస్తున్నారు. మొదట్లో పట్టణాలకే పరిమితం అయిన కోవిడ్, నేడు పల్లెలకు, మారు మూల గిరిజన తండాలకు కూడా పాకింది. దీంతో గ్రామీణ ప్రజలు ప్రయివేటు ఆసుపత్రులు, ఆరెంపీ డాక్టర్లకు ఆశ్రయిస్తున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని కొన్ని ప్రయివేటు ఆసుపత్రులు మూడు రోజుల కరోనా ట్రీట్మెంట్ కు రూ.30 వేల ప్యాకేజీని అనధికారికంగా ప్రకటించాయి. దీంతో గ్రామీణులు ప్రయివేటు ఆసుపత్రుల దోపిడీకి గురవుతున్నారు.
మరో నెల రోజుల్లో టెస్టులు కూడా నిలిపివేస్తారా
ఏపీలో కరోనా టెస్టులు తగ్గించుకుంటూ పోతున్నారు. మరో నెల రోజులకు గణనీయంగా తగ్గించి కరోనా టెస్టులు నిలిపివేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరికైనా తీవ్ర అనారోగ్య సమ్యలు ఉంటేనే టెస్టులు చేయాలని వైద్యాధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఏపీ ప్రజలు కరోనాతో సహజీవనం చేయాల్సిందేనన్న మాట.
మరలా లాక్ డౌన్ ఉండదు
దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తోన్న 7 రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. ఈ రాష్ట్రాలు అవసరం అయితే కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు లాక్ డౌన్ అమలు చేసుకోవాలని ప్రధాని మోడీ ముఖ్యమంత్రులకు సూచించారు. అయితే ఏపీలో మాత్రం అలాంటి ఆలోచన చేయడం లేదు. ఇప్పటికే ప్రభుత్వ ఆదాయం దారుణంగా తగ్గిపోయింది. ఇక మరలా లాక్ డౌన్ అంటే జీతాలు ఇవ్వడం కూడా కష్టం అవుతుందని ప్రభుత్వం వర్గాలు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇక అన్నీ వ్యాపారాలు, బార్లు బార్లా తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం. అంటే ఏపీలో ఇక కరోనా లాక్ డౌన్లు లేనట్టేనని అర్థం చేసుకోవచ్చు.











