ముందుగా రాష్ట్రాల పరిస్థితులను చక్కదిద్ది ఆ తరువాత జాతీయ స్థాయిలో పార్టీని చక్కదిద్దేందుకు కాంగ్రెస్‌లో కీలకమార్పులు చోటు చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా హస్తం హవా మసకబారుతుండటంతో పార్టీని మళ్లీ పూర్వవైభవానికి తీసుకొచ్చేందుకు అధిష్టానం తీవ్రంగా కృషిచేస్తోంది. ఇందులో భాగంగానే వివిధ రాష్ట్రాలకు కొత్త సెక్రటరీలతోపాటూ రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జీల నియామకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీగా ఆర్‌సి కుంతియా స్థానంలో తమిళనాడు విరుధానగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న మాణికం ఠాకూర్‌ను నియమించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఆయన మకాం వేసి పార్టీని ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. పార్టీఅంతర్గత అంశాలు, పిసిసి అధ్యక్షపదవి, దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ మండలి ఎన్నికలపై ఆయన నాయకులతో చర్చించనున్నారు.
రెండు రోజుల పర్యటన..
అయితే ఆయన ఇంఛార్జ్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత మొదటి సారిగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. పార్టీ కార్యక్రమాల కోసం రెండు రోజుల వరకు హైదరాబాద్‌లోనే మకాం వేయనున్నారు. పార్టీ నాయకుల మధ్య తలెత్తుతున్న విభేదాలు, పిసిసి పీఠం కోసం నేతల మధ్య పోటీ, పార్టీ పరువును మంటగలిపేలా సమావేశాల్లో, సోషల్ మీడియాలో ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం లాంటి అంశాలపై ప్రధానంగా చర్చించేందుకు వస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే రైతు బిల్లుకు వ్యతిరేకంగా గాంధీభవన్ నుంచి రాజ్ భవన్ వరకు ఈనెల 28న కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన నిరసన ర్యాలీలో కూడా ఈయన పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంబంధించి అంశాలపైన కోర్‌కమిటీలో ఆయన నాయకులతో చర్చించనున్నారు. నేతల మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించేందుకు, సొంత ఎజెండాలను పక్కనబెట్టి పార్టీ ఎజెండాను మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఆయన టికాంగ్రెస్ నేతలకు దిశానిర్ధేశం చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇకమీదట ఒక లెక్క.. తాను వచ్చినంక మరో లెక్క అన్నట్లుగా ఆయన సమావేశం పార్టీ నాయకులతో వాడివేడిగా ఉంటుందని సమాచారం.
మంటలు చల్లారేనా..
అయితే మాణికం ఠాకూర్ రెండు రోజుల హైదరాబాద్ పర్యటన టికాంగ్రెస్‌లో మార్పులను ఆశించవచ్చా అనే చర్చ జరుగుతోంది. పేరుకే జాతీయ పార్టీ అయినప్పటికినీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని నేతలకు ఒకరంటే మరొకరికి పడదనే భావన పార్టీ వర్గాల్లో ఉంది. ఎప్పుడూ అంతర్గత విభేదాలతో రచ్చకెక్కుతుంటారు. మరోపక్క పిసిపి అధ్యక్ష పదవి కోసం ఇక్కడి నేతల మధ్య పోటీ తీవ్రంగా నడుస్తోంది. టిడిపి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపి రేవంత్‌రెడ్డి, ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు మధ్య పోటీ నడుస్తోంది. మరోకసారీ తనకే అవకాశమివ్వాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వరా తెలుస్తోంది. ఈ క్రమంలో మాణికం ఠాకూర్ హైదరాబాద్‌కు రావడం ఈ అంశంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే నాయకుల మధ్య రాజుకుంటున్న మంటలను ఆయన చేసే ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో లేదో చూడాలి.











