లంచం తీసుకునే అధికారులు ఇక మీరు చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం. అవినీతికి పాల్పడే అధికారుల ఆటకట్టించేందుకు బాధితులు సోషల్ మీడియాను మంచి ప్లాట్ ఫామ్‌గా ఉపయోగించుకుంటున్నారు. లంచం తీసుకునే వారి వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టులను పెట్టి వసూళ్లకు పాల్పడేవారి ఆటకట్టిస్తున్నారు. ఏవో పనుల కోసం వాహనదారులు రవాణా శాఖ కార్యాలయాలకు వెళ్తుంటారు. అక్కడ దళారులకు, కొంత మంది అధికారులకు ఎంతో కొంత మొత్తం ముట్టజెప్పందే పనులు కావనే అభిప్రాయం ఉంది.
అయితే దీనికి భిన్నంగా ఓ అధికారి రోడ్డుపై వెళ్లే వాహనాలను ఆపుతూ వసూళ్లకు పాల్పడ్డారు. ఆయన చేసిన ఆ పనిని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో అతనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ ఇ.మృత్యుంజయరాజు శుక్రవారం సాధారణ దుస్తుల్లో తాడేపల్లి బైపాస్ రహదారిపై వాహనాలను తనిఖీ చేశాడు. వాహనాల్లో ఏం సరుకు రవాణా చేస్తున్నారో తెలుసుకుని ఆ సరుకు విలువను బట్టి కొంత మొత్తం ఇవ్వాలని డబ్బులు దండుకున్నాడు. ఓ రైతుకు సంబంధించిన సరుకు తాలుకు పత్రాలు చూపించినా రూ.200 ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. అలాగే ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన 3 లారీల నుంచి రూ.500 బలవంతంగా తీసుకున్నాడు. ఇలా వచ్చిపోయే వాహనాల నుంచి లంచాలను దండుకున్నాడు. ఈతతంగాన్నంతా ఒకరు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. అంతేకాకుండా రవాణా శాఖ అధికారులకు సైతం పంపాడు. దీనిపై రవాణాశాఖ కమిషనర్ పిఎస్ఆర్ ఆంజనేయులు స్పందించి ఆ ఎంవిఐపై చర్యలు తీసుకున్నారు. అతనిని సస్పెండ్ చేస్తూ అతను విధులు నిర్వర్తిస్తున్న హెడ్‌క్వార్టర్స్ పరిధి దాటి వెల్లకూడదని ఆదేశాలు జారీచేశారు. ఆ అవినీతి అధికారి తిక్క బాగా కుదిరిందని బాధితులు అంతా అనుకున్నారు.
అవినీతికి పాల్పడే అధికారులు మీరు చేసే తప్పులను ఎవ్వరూ చూడరు, వాటిపై ఎవరూ స్పందించరు అనుకునే అభిప్రాయం మీకు ఉంటే వాటిని ఇక కట్టిపెట్టండి. ఇలానే ఎవరో ఒకరు మీ భరతం పట్టే అవకాశం ఉంది సుమా!