అందం, అభినయం కలగలిస్తే అనుష్క. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ డాల్ అనే విమర్శలకు తన పెర్ఫార్మెన్స్ తో సరైన సమాధానం చెప్పింది. జేజేమ్మ అయినా.. దేవసేన అయినా.. అరుంధతి అయినా భాగమతి అయినా.. ఏ పాత్రకయినా సరే.. ఆమె అందమైన అభినయం తోడయితే.. తెరమీద జింతాత జింతా జింతానే.
పదిహేనేళ్లుగా దక్షిణాది తెరను ఏలుతున్న గ్లామర్ బ్యూటీ .. సూపర్ స్వీటీ అనుష్క పుట్టిన రోజు ఈ నవంబర్ 7. ఈ సందర్భంగా ఆమె అభినయ ప్రస్థానం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.
కన్నడ అమ్మాయి అయినప్పటికీ కేవలం తెలుగు, తమిళ భాషల్లోనే కథానాయికగా వెలిగిపోవడం అనుష్కకు మాత్రమే చెల్లింది. ఈ రెండుభాషల్లోనూ.. దాదాపు అగ్ర కథా నాయకులందరి సరసన నటించి మెప్పించింది. కర్నాటకలోని మంగళూరులో జన్మించిన అనుష్క.. తుళువ వంశానికి చెందిన బెల్లిపడి ఉరమలు గుత్తు ఫ్యామిలీకి చెందింది. స్కూలింగ్, డిగ్రీ కర్నాటకలోనే పూర్తి చేసింది అనుష్క. చదువు పూర్తయ్యాకా ఆమె యోగా ఇన్ స్ట్రక్టర్ భరత్ ఠకూర్ (భూమిక భర్త) దగ్గర శిక్షణ తీసుకుంది.
2005లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన నాగార్జున ‘సూపర్’ మూవీతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన మహానందిలో మరింతగా ఆమె గ్లామర్ ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆ తర్వాత రాజమౌళి ‘విక్రమార్కుడు’ మూవీలో రవితేజ తో ఆమె పండించిన రొమాన్స్ జనానికి మంచి కిక్కిచ్చింది. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలన్నీ ఆమెలోని గ్లామర్ యాంగిల్ ను ఓ రేంజ్ లో ఎలివేట్ చేశాయి. అయితే ‘అరుంధతి’ సినిమాతో తనలో అద్భుతమైన పెర్ఫార్మర్ కూడా దాగి ఉందని నిరూపించుకుంది అనుష్క. ఆ సినిమా తెచ్చిపెట్టిన ఘన విజయంతో ఆమె సౌత్ లోనే టాప్ మోస్ట్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత నుంచి అనుష్క తన అందంతోనూ, అభినయంతోనూ సరిసమానంగా మెప్పిస్తూ దూసుకుపోయింది. అనుష్క కెరీర్ లో ‘బాహుబలి’ మూవీ ఒక అపురూప చిత్రం. ఆ తర్వాత ‘భాగమతి, రుద్రమదేవి’ కూడా ఆమె కెరీర్ బెస్ట్ మూవీసే. స్వీటీ అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది లియో న్యూస్.