కీసర మండలం రాంపల్లి దాయర గ్రామం పరిధిలో భూముల వ్యవహారానికి సంబంధించిన గొడవ ఇది. సర్వే నెంబరు 604 నుంచి 614 వరకు గల భూముల్లో 53 ఎకరాల స్థలంపై ఇరు వర్గాల మధ్య వివాదం ఉంది. వ్యవహారం కోర్టులో ఉంది. ప్రభుత్వపరంగా ఉండే రెవెన్యూ రికార్డులను టాంపరింగ్, తారుమారు చేయగలిగితే… సహజంగానే కోర్టులో వారి కేసుకు బలం అవుతుంది. కీసర సమీపంలో 53 ఎకరాలు అంటే వందల కోట్ల రూపాయల వ్యవహారం. దాంతో వాళ్లు ఏస్థాయికైనా వస్తారని.. మండల తాశీల్దారు నాగరాజు గారు కనిపెట్టారు. రెండుకోట్ల రూపాయల లంచం బేరం పెట్టారు. రికార్డుల్లో వారికి కావల్సిన విధంగా ‘మార్పుచేర్పులు’ చేయడానికి డీల్ కుదుర్చుకున్నారు.

ఏఎస్ రావు నగర్లోని ఇంట్లో 1.1 కోట్ల రూపాయల లంచం మొదటివిడతగా తీసుకుంటూ ఉండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా దాడిచేసి పట్టుకున్నారు. ఈ డీల్ లో భాగస్వాములుగా తాశీల్దారుకు తోడ్పడిన రాంపల్లి దాయర గ్రామానికి చెందిన కందాడి అంజిరెడ్డి, వరంగల్‌కు చెందిన శ్రీనాథ్ యాదవ్, రాంపల్లి వీఆర్‌ఏ సాయిరాజ్ కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
మామూలు నాగరాజు కాదు..
పువ్వు పుట్టగానే పరిమళించిందన్నట్టు.. నాగరాజు రెవెన్యూ శాఖలోనే చేరిననాటినుంచే తన చేతివాటం ప్రారంభించాడు. టైపిస్టుగా మొదలెట్టిన ప్రస్థానంలో డిప్యూటీ తాశీల్దారు అయ్యాడు. అప్పట్లోనే అవినీతి కేసుల్లో దొరికాడు. కానీ.. హైలెవెల్ ఉన్నతాధికారుల్ని కూడా మేనేజిచేసి తనమీద కేసుల్ని కొట్టేయించుకుని తాను ఏకంగా తాశీల్దారుగానే ఎదిగాడు. తాజాగా ఏసీబీ వలలో చిక్కాడు. లంచం డిమాండ్ చేసిన కారణంగా.. గతంలో ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడడానికి కూడా నాగరాజు కారణమయ్యాడనే ఆరోపణలున్నాయి.
విధానాలే మారుతాయా?
ఒక సాధారణస్థాయి అధికారి.. ఈస్థాయిలో అక్రమాలు చేస్తూ.. అవినీతికి పాల్పడుతుండడం.. తెలంగాణ ప్రభుత్వానికి కళ్లు తెరిపిస్తుందా? అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో నడుస్తోంది. నాగరాజు పట్టివేతతో ప్రభుత్వంలోని పెద్దలు కూడా షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకడీల్‌లో రెండుకోట్ల లంచం, 1.1 కోట్ల ఎడ్వాన్స్ అంటే.. సాధారణంగా అది రాజకీయ నాయకులస్థాయి ! కానీ ఒక చిన్న స్థాయి అధికారి ఆ రేంజిలో ఉండడం షాక్ కాక మరేంటి? ఈ నేపథ్యంలో మొత్తం రెవెన్యూ శాఖలోనే కొత్త విధానాలు ఏమైనా వస్తే తప్ప పరిస్థితి మారదు.











