‘పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం, టాక్సీవాలా’సినిమాలతో టాలీవుడ్ సెన్సేషన్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఆ క్రెడిట్ తో అభిమాన గణాన్నీ భారీగానే పెంచుకున్నాడు. ఎర్లియర్ గా అతడి సినిమాలేవీ అనుకున్నంతగా అలరించలేకపోయినా.. క్రేజ్ మాత్రం చెక్కుచెదరలేదు. అయినప్పటికీ పెద్ద సంస్థలన్నీ విజయ్ తో సినిమాలు నిర్మించడానికి ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ (వర్కింగ్ టైటిల్ ) అనే యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు. ఇదే సినిమాతో బాలీవుడ్ లోకీ అడుగుపెట్టబోతున్నాడు. ఇంకా పలు ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టుకున్నాడు.
అటు నిర్మాణ రంగంలోనూ, రౌడీ బ్రాండ్ తో బట్టల బిజినెస్ లోనూ బిజీగా ఉన్నాడు. వాటితో పాటు ప్రముఖ కంపెనీల బ్రాండ్ అండార్స్ మెంట్స్ లోనూ విజయ్ సత్తా చాటుకుంటున్నాడు. వీటన్నితో పాటు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్ని కూడా ముమ్మరంగా సాగిస్తున్నాడు. అయితే క్రేజ్ ఎంత పెరిగినా.. పేరు ఎంత మారుమోగినా .. విజయ్ ఇంతవరకూ భారీ బడ్జెట్ మూవీలో నటించలేదు. ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాడని సమాచారం. త్వరలోనే విజయ్ హీరో గా రూ. 100కోట్ల సినిమా నిర్మాణం జరుపుకోనుందని వార్తలొస్తున్నాయి.
ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో నానీ, సుధీర్ బాబు సినిమా ‘వి’ త్వరలోనే ఓటీటీలో విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ నెక్స్ట్ తీయబోయేది విజయ్ తోనే. ఈ సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లోనే తెరకెక్కనుందట. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమా కోసమే రూ. 100కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నారట. విజయ్ దేవరకొండ ఇంత వరకూ రొమాంటిక్ లవ్ స్టోరీస్ లోనే నటించిన సంగతి తెలిసిందే. నిజానికి విజయ్ కు మంచి పేరు తెచ్చిపెట్టిన జోనర్ అదే.
అయితే ఇంద్రగంటి మోహన కృష్ణ మాత్రం విజయ్ తో పక్కా యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. దానికోసం ఏకంగా విజయ్ మాసీ మేకోవర్ అవుతున్నాడని సమాచారం. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ వేగవంతంగా జరుగుతోందట. అలాగే స్ర్కిప్ట్ వర్క్ కూడా దాదాపు పూర్తికావచ్చిందట. వచ్చే సంవత్సరం ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుందని సమాచారం. ‘అర్జున్ రెడ్డి’ లోనూ, ‘టాక్సీవాలా’లోనూ విజయ్ లోని మాస్ యాంగిల్ ను కొంతమేరే చూసిన అభిమానులు.. ఈ సినిమాతో అతడ్ని పూర్తి మాస్ హీరోగా చూస్తారని చెబుతున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ మూవీ విజయ్ కు ఏ స్థాయి ఇమేజ్ ను తెచ్చిపెడుతుందో చూడాలి.