ఏపీ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోతోంది. అందినకాడికి అప్పులు చేస్తున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే ఏపీ ప్రభుత్వం రూ.39946 కోట్ల అప్పులు తెచ్చింది. మొదటి నాలుగు మాసాల్లో ప్రభుత్వ ఆదాయం కేవలం రూ.19000 కోట్లు మాత్రమే. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం రూ.35000 కోట్లు రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంది. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రాల ఎఫ్ ఆర్ బీ ఎం పరిమితిని 0.5 శాతం పెంచడంతో ఏపీ ప్రభుత్వం మరో రూ.5000 కోట్లు అదనంగా అప్పు తెచ్చుకునే వెసులుబాటు దొరికింది. తాజాగా సెప్టెంబరు మొదటి వారంలో ఉద్యోగుల జీతాలు, పింఛన్ల కోసం తెచ్చిన రూ.3000 కోట్ల అప్పుతో ఏపీ రుణ పరిమితి దాదాపుగా ముగిసినట్టే. ఇక కొత్త అప్పులు సాధ్యం కాదు.
ఆసరా పరిస్థితి ఏంటి??
ఎన్నికల హామీల్లో భాగంగా వైసీపీ ప్రభుత్వం డ్వాక్రా గ్రూపు మహిళలకు రుణమాఫీ చేయాల్సి ఉంది. నాలుగు సంవత్సరాల్లో రుణమాఫీ పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 10వ తేదీన డ్వాక్రా గ్రూపు మహిళలకు ఆసరా పేరుతో రూ.6000 కోట్లు చెల్లించాలని నిర్ణయించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే ఇంత మొత్తం రుణం సేకరించడం ఇప్పట్లో సాధ్య పడేలా లేదు. ఎఫ్ ఆర్ బీ ఎం పరిమితిని 5 శాతానికి పెంచాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం సహకరిస్తే ఏపీ మరో రూ.15000 కోట్లు రుణాలు సేకరించుకునే వెసులుబాటు దొరుకుతుంది. అయితే ఈ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
15 నెలల్లో రూ.1,15,000 కోట్ల అప్పులు
అప్పులు చేయడంలో ఏపీ ప్రభుత్వం రికార్డులను తిరగరాస్తోంది. నవరత్నాల పేరుతో ఇప్పటికే రూ.70000 కోట్లు లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. నవరత్నాలతో పాటు, ఆసరా, సామాజిక పింఛన్ల పెంపు వంటి పథకాలకు ఏటా రాష్ట్ర ప్రభుత్వం రూ.1,20,000కోట్లు వెచ్చించాల్సి ఉంది.ఇంత మొత్తం ప్రభుత్వానికి ఆదాయం లేదు. కనీసం అప్పులు చేద్దామన్నా ఎఫ్ ఆర్ బీ ఎం అనుమతించదు. అందుకే విద్యుత్ రంగంలో సంస్కరణలు పూర్తి చేస్తే కేంద్రం ఎఫ్ ఆర్ బీ ఎం పరిమితి పెంచే అవకాశం ఉంది. అందుకే ఆదరాబాదరా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలోని 18 లక్షల పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేస్తే కేంద్రం కనికరించే అవకాశం ఉంది. ఆ తరవాత ఏపీ ప్రభుత్వానికి మరింత అప్పులు చేసే వెలులుబాటు దొరకుతుంది.
కార్పొరేషన్ల ముసుగు కప్పే ప్రయత్నం?
దీనిపై ఏపీ ప్రభుత్వం పరిశోధన చేస్తోంది. తాజాగా పెంచిన పరిమితితో ఎఫ్ ఆర్ బీ ఎం పరిమితి 3.5 శాతం. అయితే దీన్ని 5 శాతం చేస్తారా లేదా అనేది భవిష్యత్ లో తేలనుంది. ఈ లోపు భారీగా అప్పులు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తదారులను అన్వేషిస్తోంది. ఏపీ ప్రభుత్వం అప్పులు తేవాలంటే ఎఫ్ ఆర్ బీ ఎం అడ్డు వస్తుంది. అదే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అప్పులు తెస్తే ఈ చట్టం వర్తించదని తెలుస్తోంది. అందుకే పలు కార్పొరేషన్ల ద్వారా సాధ్యమైనన్ని అప్పులు తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిందని సమాచారం.
నవరత్నాలు ఉంటాయా? రాలిపోతాయా?
ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లోనే సంవత్సరం కాలంలో చేయాల్సిన అప్పులు చేశారు. ఇక అప్పులు పుట్టవు. మరి నవరత్నాలకు నగదు ఎక్కడ నుంచి తీసుకు వస్తారనేది ప్రధాన సమస్య. ఇంకా పాఠశాలలు ప్రారంభం కాలేదు కాబట్టి జగనన్న విద్యాదీవెన పధకం నిధులు విడుదల చేయలేదు. ఈ పధకానికి కూడా రూ.5000 కోట్లు అవసరం అవుతాయి. ఇలా ప్రతి నెలా ఒక పథకం అమలు చేయడం ద్వారా నగదు బదిలీ చేయాలంటే ఏపీ ప్రభుత్వం అప్పులు చేయకతప్పదు. అప్పు తీసుకునే వెలులుబాటు కూడా లేకపోవడంతో ఇక వైసీపీ ప్రభుత్వం నవరత్నాలను ఎలా ముందుకు తీసుకువెళుతుందో చూడాల్సిందే..
పన్నుల బాధుడు మొదలు పెడుతున్నారా?
ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటే రుణం తీసుకునే అవకాశం కూడా పెరుగుతుంది. అందుకే ఏపీ ప్రభుత్వం పన్నుల బాదుడు ప్రారంభించింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెంచారు. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా శ్లాబులను సవరించి భారీగానే ప్రజలపై భారం వేశారు. మరో రెండు మూడు రోజుల్లో వాహనాల జీవితకాల పన్నులు భారీగా పెంచాలని కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఇందుకు ఏపీ సీఎం కూడా అంగీకరించారట. దీని ద్వారా అదనంగా మరో రూ.400 కోట్ల ఆదాయం పెరగనుంది. ఇలా ఎక్కడ ఆదాయం వచ్చే చిన్న అవకాశం ఉన్నా వదలడం లేదు.
చివరకు కర్రీపాయింట్ పెట్టుకున్నా ఏటా రూ.2500 పన్ను వసూలు చేస్తున్నారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో ఏ విధంగా పిండవచ్చో పరిశోధన సాగిస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే ప్రతి శాఖ నుంచి అదనంగా 15 శాతం రెవెన్యూ పెంచుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ఇక ప్రజలపై పన్నుల బాధుడు తప్పదు.