వైసీపీలో కీలక నేతగా కొనసాగుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఓ పెద్ద సవాలే విసిరారు. ఈ ఇద్దరు నేతలూ చిత్తూరు జిల్లాకు చెందినవారే కావడంతో ఇద్దరి మధ్య ఇటీవలి కాలంలో మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డికి మంత్రి పదవి దక్కడం, ఆ క్రమంలో ఆయన అనుచర వర్గం చిత్తూరు జిల్లాలో ప్రత్యేకించి పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో స్వైర విహారం చేస్తున్న వైనం జనంలో పెద్ద ఎత్తున చర్చకు వస్తోంది. ఈ అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు… పెద్దిరెడ్డి దౌర్జన్య కాండను ప్రశ్నించారు. పెద్దిరెడ్డి అనుచరులు జిల్లాలో ప్రత్యేకించి పుంగనూరులో కొనసాగిస్తున్న అరాచకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పెద్దిరెడ్డి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రతిస్పందించారు. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని, జిల్లాలో ఏ నియోజకవర్గంలోనైనా చంద్రబాబుతో పోటీ అన్నా తాను సిద్ధమేనని, చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో కూడా పోటీకి సై అంటూ పెద్దిరెడ్డి పెద్ద సవాలే విసిరారు.
కుప్పంలో చంద్రబాబును ఓడించే సత్తా పెద్దిరెడ్డికి ఉందా?
సవాళ్లు, ప్రతిసవాళ్లదేముంది? మైకు దొరికితే మన నేతలు ఏ రీతిన రెచ్చిపోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సరే… పెద్దిరెడ్డి సవాల్‌కు చంద్రబాబు సరేనంటే… మరి తాను చెప్పినట్లుగా చిత్తూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో అయినా బరిలోకి దిగి పెద్దిరెడ్డి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయా? అది కూడా కుప్పంలో చంద్రబాబును ఓడించే సత్తా పెద్దిరెడ్డికి ఉందా? కుప్పంలో చంద్రబాబు వరుసగా ఏడు సార్లుగా గెలుస్తూ వస్తున్నారు. 1989 మొదలు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లోనూ చంద్రబాబు బంపర్ మెజారిటీతోనే గెలిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుండగా… కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు చాలా ప్రయత్నాలు చేసినా అవేవీ వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత వైసీపీ కూడా కుప్పంలో చంద్రబాబు ఓటమే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది. అయితే అవి కూడా ఇప్పటిదాకా సత్ఫలితాలు ఇవ్వలేదు. మొత్తంగా కుప్పం చంద్రబాబుకు కంచుకోట కిందే లెక్క. అందులోనూ పెద్దిరెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక్కరంటే ఒక్కరు కూడా కుప్పంలో గెలిచిన దాఖలా ఇప్పటిదాకా లేదు.
Must Read ;-మోదీ కంటే అడుగు ముందే చంద్రబాబు సెంట్రల్ విస్టానే సాక్ష్యం

రెండుచోట్ల మినహా కనిపించని పెద్దిరెడ్డి హవా
ఇక చిత్తూరు జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల విషయానికి వస్తే…. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా… వాటిలో పూతలపట్టు, సత్యవేడు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. ఇక్కడ చంద్రబాబు, పెద్దిరెడ్డిల పోటీని ఊహించలేం. మిగిలిన 10 నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి విజయం సాధించిన తంబళ్లపల్లి నియోజకవర్గం మినహా ఏ ఒక్క నియోజకవర్గంలోనూ పెద్దిరెడ్డి హవా కనిపించదు. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ నేతలే సత్తా చాటుతున్నారు. వీరిలో పెద్దిరెడ్డి సామాజికవర్గానికి చెందిన ఆర్కే రోజా (నగరి), చెవిరెడ్డి భాస్కరరెడ్డి (చంద్రగిరి), బియ్యపు మధుసూదనరెడ్డి (శ్రీకాళహస్తి), భూమన కరుణాకరెడ్డి(తిరుపతి), చింతల రామచంద్రారెడ్డి (పీలేరు) నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి అడుగుపెట్టలేని పరిస్థితి. పెద్దిరెడ్డి ఎక్కడ తమ నియోజకవర్గంలో తిష్ట వేస్తాడోనన్న భయం ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను పట్టి పీడిస్తోంది. ఈ నేపథ్యంలో తమ నియోజకవర్గానికి పెద్దిరెడ్డి వస్తున్నారంటేనే… ఈ నియోజవర్గాల ఎమ్మెల్యేలు అలెర్ట్ అయిపోతున్నారు. వెరసి పెద్దిరెడ్డికి ఈ నియోజకవర్గాల్లో పట్టు దొరకకుండా వారంతా తమదైన శైలిలో వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగానే… నగరిలోకి పెద్దిరెడ్డి రాకను రోజా ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు.
పుంగనూరుకు పొరుగునే ఉన్నా..
ఇక మిగిలిన చిత్తూరు, మదనపల్లి, పలమనేరు నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డికి అంతగా పట్టు లేదనే చెప్పాలి. పలమనేరు పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరుకు పొరుగునే ఉన్నా… అక్కడ తన సొంత సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇప్పించుకోవడంలో పెద్దిరెడ్డి సక్సెస్ కాలేకపోయారు. మదనపల్లి కూడా పెద్దిరెడ్డికి పొరుగు నియోజకవర్గమే అయినా.. అక్కడ మైనరిటీలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలనే దాదాపుగా అన్ని పార్టీలు బరిలోకి దింపుతున్నాయి. చిత్తూరులో రెడ్డి ప్రాబల్యం బాగా తక్కువ. అక్కడ బలిజ సామాజికవర్గానిదే పెత్తనం. ఏ పార్టీ అయినా ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలనే బరిలోకి దించుతోంది. జిల్లా కేంద్రంగా ఉన్న ఈ నియోజకవర్గంపై పెద్దిరెడ్డికి అంతగా పట్టు లేదనే చెప్పాలి. మొత్తంగా తన సొంత నియోజకవర్గంతో పాటు తన సోదరుడు ఎమ్మెల్యేగా ఉన్న తంబళ్లపల్లిల్లో మాత్రమే పెద్దిరెడ్డి హవా కనిపిస్తుండగా.. మిగిలిన 12 నియోజకవర్గాలపై పెద్దిరెడ్డికి పట్టు లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో జిల్లాలో చంద్రబాబుపై ఎక్కడి నుంచైనా పోటి చేసి గెలుస్తానని పెద్దిరెడ్డి చేసిన సవాల్ పస లేని మాటగానే చెప్పుకోవాలి.
Also Read: చంద్రబాబు టీమ్‌లో యువరక్తం