చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా దూకుడు కనబరుస్తున్నారు. నిరంతరం ప్రతీకార దాడులు తప్పని చెప్పే చంద్రబాబు నోట వెంట ప్రతీకార దాడులు తప్పవని రావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పార్లమెంట్ సమీక్షలో భాగంగా అనంతపురం జిల్లా నాయకులతో జూమ్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. 2019లో అనంతపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన జేసి పవన్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి రక్తాన్ని చిందించైనా పార్టీని కాపాడుకుంటామని హెచ్చరించడం గమనార్హం. ఉరవకొండ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఉండేవని కానీ జగన్ పరిపాలనలో ఇంకా దారుణాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
2019లో దారుణమైన పరాజయంతో టీడీపీ నాయకులు నిరాశలో ఉన్నారు. వారిలో జోష్ నింపేందుకు చంద్రబాబు తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ప్రతి విషయాన్ని జగన్ రాజకీయ కోణంలో చూస్తున్నారని చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. టీడీపీ శ్రేణులను వేదించే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనార్హం. వైసీపీ చేస్తున్న అరాచకాలను రికార్డు చేస్తున్నాం. వడ్డీతో సహా చెల్లిస్తామని టీడీపీ నాయకులతో చంద్రబాబు వెల్లడించారని మీడియా కథనాలను ప్రచురించింది. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని వైసీపీ ప్రభుత్వ పని తీరును ఎండగట్టాలని నాయకులకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.











