శివబాలాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. ఎందుకంటే 17 ఏళ్ల క్రితమే ఆయన హీరోగా తెలుగు తెరకి పరిచయమయ్యాడు. ‘ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ’ సినిమాతో ఆయన ఎంట్రీ ఇచ్చాడు. కుర్రాడు ఎర్రగా బుర్రగా కుదురుగా ఉన్నాడు .. ఫ్యూచర్ ఉంది అని చాలామంది అనుకున్నారు. ‘ఆర్య’ సినిమా ఆయనకి మరింత మంచిపేరు తెచ్చిపెట్టింది. దాంతో ఇక ఈ అబ్బాయి దూసుకుపోవడం ఖాయమని చెప్పుకున్నారు. ఆశించిన స్థాయిలో దూసుకుపోకపోయినా, వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు.
తాజాగా ఆయన తన భార్య ‘మధుమిత’తో కలిసి ‘ఆలీతో సరదాగా‘ కార్యక్రమానికి హాజరయ్యాడు. తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నాడు. “ఆర్య సినిమా తరువాత మంచి ప్రాజెక్టు కోసం 6 నెలల వరకు వెయిట్ చేశాను .. ‘సంక్రాంతి‘ వంటి మంచి సినిమా చేశాను. అంత మంచి సినిమా చేసినా మళ్లీ గ్యాప్ వచ్చింది. నిజానికి నాకు చాలా మొహమాటం ఎక్కువ. ఎవరిని కూడా నేను అవకాశం ఇవ్వమని అడగను. అయినా వెళ్లి కొంతమందిని అడిగాను .. మీకు తగిన క్యారెక్టర్ ఉంటే మేము పిలుస్తాను అని చెప్పేవాళ్లు .. కానీ పిలిచేవారు కాదు.
నాకు అవకాశాలు రాకపోవడానికీ .. నేను ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లకపోవడానికి గల కారణం ఏమిటని నేను పరిశీలన చేసుకుంటే నాకే అర్థంకాని పరిస్థితి. నాకు గల మొహమాటమే అందుకు కారణమై ఉంటుందని మాత్రమే అనిపిస్తూ ఉంటుంది. ఎవరినో వెళ్లి అవకాశాలు అడగడమెందుకూ .. మనమేంటో మనమే ప్రూవ్ చేసుకుందామని అనుకున్నాను. అందుకోసమే సొంత ఖర్చుతో ఒక సినిమా తీసుకున్నాను. రిలీజ్ విషయంలో హెల్ప్ చేస్తారనుకున్నవారు చేయలేదు. అందువలన నేను నష్టాలు చూడవలసి వచ్చింది” అని చెప్పుకొచ్చాడు
Must Read ;- రాఘవేంద్రరావు నటించడానికి అప్పుడుగానీ ఒప్పుకోలేదట!











