ఫ్రాన్స్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఫ్రాన్స్ నగరం నీస్ లో గురువారం జరిగిన ఉగ్ర దాడిలో ఓ మహిళతో పాటు మరో ఇద్దరు మరణించారు. కత్తితో చర్చిలో ప్రవేశించిన ఆగంతకుడు మహిళపై దాడి చేసి ఆమె తల నరికేశాడు. ఇదే ఘటనలో మరో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నగరంలోని నాట్రేడేమ్ చర్చిలో ఈ దారుణం చోటు చేసుకుంది. దాడికి పాల్పడిన వ్యక్తి చర్చిలోకి ప్రవేశించి ‘అల్లాహ్ అక్బర్’ అని అరుస్తూ చర్చి వార్డెన్ గా భావిస్తున్న మహిళ పై దాడి చేసి తల నరికేశాడని, పక్కనే ఉన్న మరో ఇద్దరిని కత్తితో దాడి చేసి చంపినట్లుగా నీస్ మేయర్ క్రిస్టియన్ ఎస్త్రోసి పేర్కొన్నారు.
ఈ తరహా దాడులు జరగడం ఈ నెలలోనే ఇది రెండవది. కొద్ది రోజుల క్రితమే ఒక ఉపాధ్యాయుడు పాఠశాల విద్యార్థులకు ముస్లిం ప్రవక్త గురించిన కార్టూన్లు చూపిస్తున్నడన్న నెపంతో ఉగ్రవాదులు ఉపాధ్యాయుని తల నరికి చంపారు. ఆ ఘటన ఇంకా మర్చిపోకముందే అలాంటిదే మరోకటి చోటు చేసుకోవడంతో ఫ్రాన్స్ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
ఈ దాడికి పాల్పడిన దుండగుడిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు కార్టూన్లను ప్రదర్శించే హక్కు తమకు ఉందంటూ ఈ హత్యను ఖండిస్తూ నిర్వహించిన ర్యాలీల్లో నిరసనకారులు నినదించారు. ఫ్రాన్స్ పై ముస్లిం అతివాదులు కన్నేశారని..రానున్న రోజుల్లో కూడా ఇలాంటి కార్టూన్లు వస్తూనే ఉంటాయని ఫ్రాన్స్ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ఇది ముస్లిం సమాజంలో మరింత ఆగ్రహానికి కారణమైంది. ముస్లింలను రెచ్చగొడుతున్నారంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడిపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా విమర్శలు గుప్పించారు.