తెలంగాణలో రాజకీయం మారిపోతోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్‌గా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ నేతలు టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తుండటం, రాష్ట్ర నాయకుల విజ్ణప్తులను వెంటవెంటనే అమలు పరుస్తూ మీ వెంట మేం ఉన్నామన్న భరోసానిస్తోంది జాతీయ నాయకత్వం. ఇందుకు నిదర్శనమే ఈ మధ్య జరిగిన పరిణామాలు. రాష్ట్ర బీజేపీ నేతలు కోరిన వెంటనే సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేయడంతో పాటు సిద్దిపేటలో సంజయ్‌పై పోలీసుల దాడిని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసుల వ్యవహారం పరిశీలించేందుకు ఓ ఐపీఎస్ అధికారినే అబ్జర్వర్‌గా నియమించడంతో రాష్ట్ర కేడర్ కుషీకుషీగా ఉంది.
బీజేపీతో కలిసి వస్తామంటున్న ఇతర పార్టీల నేతలు..
బీజేపీ దూకుడు మీద ఉండటం, కాంగ్రెస్ పార్టీ పెద్దగా పోరాట పటిమ చూపక పోవడంతో రాజకీయ భవిష్యత్ కోసం చాలా మంది నేతలు ఈ పార్టీ వైపు చూస్తున్నారు. ఈ మధ్యే లేడీ అమితాబ్ విజయశాంతితో కిషన్ రెడ్డి మంతనాలు, ఆమె సానుకూలతతో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. గతంలో బీజేపీలో చేరేందుకు ఊగిసలాడుతూ వచ్చిన నేతలు సైతం మళ్ళీ ఆ పార్టీ సీనియర్ నేతలతో టచ్‌లోకి వచ్చారని తెలుస్తోంది. పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్న నేతలతో ఆచితూచి మంతనాలు చేస్తోంది బీజేపీ. ఆ లిస్ట్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వారి వారసులు కూడా బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్‌తో అన్నింటికి తెగించి పోరాడుతున్న పార్టీ బీజేపీనే అని, ఇప్పుడు కాక పోతే ఆ పార్టీని ఇంకెప్పుడు దెబ్బకొట్టలేమన్న భావనతో చాలా మంది నేతలు బీజేపీలో చేరేందుకు ఉరకలేస్తున్నారు.
డీకే అరుణ మంత్రాంగం.. కిషన్ రెడ్డి రూట్ మ్యాప్
ఇక కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలో చేరిన డీకే అరుణకు పెద్ద పీట వేసింది బీజేపీ జాతీయ నాయకత్వం. ఏకంగా జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి ఇవ్వడంతో ఆమె తన పవర్ పాలిటిక్స్ ప్రారంభించినట్టు సమాచారం. కాంగ్రెస్‌ను వీడే సమయంలో ఆ పార్టీలో తన అనుచరులకు ఆమె భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. తనకు మంచి పదవి దక్కిన వెంటనే బీజేపీలోకి తీసుకుంటానని చెప్పారని సమాచారం. తమ సహచరులకు ఇచ్చిన హామీ మేరకు అరుణ వారితో మంత్రాంగం నడుపుతున్నారు. విజయశాంతి నవంబర్ 10లోపే మంచి రోజు చూసుకుని బీజేపీలో చేరతానని కిషన్ రెడ్డితో చెప్పినట్టు తెలుస్తోంది. ఆమె చేరిన తరువాత వలసల జోరు కొనసాగుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న దాదాపు 40 మంది మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారంటూ ప్రచారం సాగుతోంది. దీంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు పూర్తి స్థాయిలో చెక్ పెట్టే పనిలో ఉన్న బీజేపీ ఇక తెలంగాణలోనూ ఆ పార్టీని ఖాళీ చేయనున్నట్టు తెలుస్తోంది.