(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
శ్రీకాకుళానికి అత్యంత సమీపంలో గార మండలంలో దీపావళి అనే గ్రామం ఉంది. జిల్లా కేంద్రం అయిన శ్రీకాకుళానికి 15 కిలోమీటర్ల దూరంలో, మండల కేంద్రమైన గార గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఆ ఊరు ఉంది. ఈ ఊరికో చరిత్ర ఉంది. చాలా సంవత్సరాల క్రితం ఓ ముస్లిం రాజు శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో తన పనులు ముగించుకుని ఇదే ప్రాంతం గుండా వెళ్తూ అస్వస్థతకు గురయ్యాడు. అక్కడి ప్రజలు అతన్ని ఓ గుడి వద్దకు తీసుకువెళ్ళి వైద్యం అందించి కోలుకునేలా చేశారు. అస్వస్థత నుండి బయటకు వచ్చిన ఆ రాజు ఇది ఏ ప్రాంతమని అడిగారట. అప్పుడు దీనికి అసలు పేరంటూ లేదని వారు తెలిపారట.. ! ఈ సంఘటన దీపావళి రోజున జరగడంతో ఆ ఊరికి దీపావళి అని నామకరణం చేశారని, దీంతో ఈ ఊరుకు ఆ పేరు వచ్చిందని గ్రామ ప్రజలు చెబుతుంటారు. అందరికీ ఇష్టమైన పండుగ పేరుతో గ్రామం ఉండడంతో అక్కడి ప్రజలు చాలా గర్వ పడుతుంటారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే సాధారణంగా అందరూ ఒకటి లేదా రెండు రోజులు దీపావళి జరుపుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఐదు రోజులు దీపావళి జరుపుకుంటారు.
Must Read: సిక్కోలు టీడీపీలో నూతనోత్సాహం
ఊరిలో వెలుగు లేదు
ఆ ఊరి పేరు దీపావళి అయినప్పటికీ ఆశించిన అభివృద్ధి లేకపోవడంతో అక్కడ నిత్యం చీకట్లు అలుముకుంటున్నాయి. సుమారు రెండువేల మంది జనాభా వున్న ఈ గ్రామ విస్తీర్ణం 143 హెక్టార్లు. 2011 సెన్స్‌స్ ప్రకారం అక్షరాస్యత కేవలం 54.47 శాతం, ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత 67.02 శాతం కంటే ఇది చాలా తక్కువ. ఇంక మహిళల అక్షరాస్యత కేవలం 46.44 శాతమే. తుఫాన్లు వంటి ప్రకృతి బీభత్సాలకు ఎక్కువగా గురయ్యే ఈ గ్రామం అభివృద్దికి ఆమడ దూరాన్నే నిలిచిపోయింది. అందువల్ల పేరులో ఉన్న వెలుగు ఊరిలో కనిపించడం లేదు.
జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తమ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందిస్తారని ఆశిద్దాం.
Also read: ‘దీపావళి’ కానుకగా ఈ రోజు సాయంత్రం ‘మాస్టర్’ టీజర్