సాధారణ ఎన్నికల్లో అనూహ్య ఓటమితో శ్రీకాకుళం జిల్లాలో బలహీనమైన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుని నియామకంతో సంస్థాగతంగా పటిష్టమవుతోంది. ఉత్సాహవంతుడు, చురుకైన వ్యక్తి ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షునిగా నియామకమవ్వడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.
తెలుగుదేశం విజయమే లక్ష్యం : కూన
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా, నారా చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా పని చేస్తామని శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ ప్రకటించిడంతో జిల్లా నాయకులు, కార్యకర్తలు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి సమక్షంలో కూన రవికుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ 18 నెలల పాలనలో జిల్లాకు చేసింది ఏమీ లేదన్నారు. పార్టీ అధినేత తనకు అప్పగించిన బాధ్యతను సద్వినియోగం చేసుకుని, పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని స్థానాల్లో పార్టీ జెండా ఎగురవేస్తానని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు తమకు ఏ కష్టమొచ్చినా చెప్పవచ్చునన్నారు. శాసన సభాపతి తమ్మినేని, మంత్రులు ధర్మాన కృష్ణదాస్, అప్పలరాజు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ప్రగల్భాలు పలుకుతున్న వైసీపీ : అచ్చెన్న
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ భావనపాడు పోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకించిన వైసీపీ నాయకులు నేడు తామే పోర్టుని తీసుకొస్తున్నట్లు ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. ఉద్దానం కిడ్నీ బాధితులకు తామే ఆసుపత్రి నిర్మించామన్నారు. రూ.5 వేల కోట్ల అంచనాలతో ఇంటింటికీ కుళాయి పథకాన్ని ప్రారంభిస్తే అధికారంలోకి వచ్చాక వాటిని వైసీపీ రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాకు అధిక ప్రాధాన్యత : కళా
పొలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకటరావు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు జిల్లాకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని, తన తరువాత పార్టీ రాష్ట్ర అధ్యక్ష స్థానం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడికి ఇవ్వడంతో ఈ విషయం మరింత స్పష్టమైందన్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ దివంగత కేంద్రమంత్రి ఎర్రన్నాయుడి వారసునిగా పార్టీ పూర్వవైభవానికి కృషి చేస్తామన్నారు. కింజరాపు కుటుంబం అవినీతికి పాల్పడదని, ప్రజల కష్టనష్టాల్లో పాలుపంచుకుంటుందని అన్నారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షురాలు గౌతు శిరీష, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ, శ్రీకాకుళం, నరసన్నపేట, పాతపట్నం నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జులు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, కలమట వెంకటరమణ, తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంత కాలం ఎడమొహం, పెడమొహంగా ఉన్న నాయకులు ఈ కార్యక్రమంలో ఒకే వేదికపైకి వచ్చి ద్వితీయ శ్రేణి నాయకుల్లో, కార్యకర్తల్లోను ఉత్సాహం నింపారు.