తమిళ స్టార్ హీరోలలో విజయ్ స్థానం ప్రత్యేకం. ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులు ఒక రేంజ్ లో సందడి చేస్తుంటారు. ఆయన తాజా చిత్రంగా ‘మాస్టర్’ రూపొందుతోంది. ఈ సినిమా నుంచి ‘దీపావళి’కి స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేయవచ్చని విజయ్ అభిమానులు భావించారు. వాళ్లు ఆశించినట్టుగానే ‘దీపావళి’ కానుకగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని విజయ్ సేతుపతి .. అనిరుథ్ తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు.
విజయ్ ఈ సినిమాలో కాలేజ్ ప్రొఫెసర్ గాను .. మాఫియా డాన్ గాను రెండు వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తున్నాడు. ఈ రెండు పాత్రల్లోను ఆయన డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. బడ్జెట్ పరంగా భారీతనమే ప్రధానంగా నిర్మితమైన ఈ సినిమాలో, కథానాయికగా మాళవిక మోహనన్ అలరించనుంది. విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తుండటం ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతోంది. అనిరుథ్ రవిచంద్రన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.
కార్తీ హీరోగా ‘ఖైదీ’ సినిమాను తెరకెక్కించి సంచలన విజయాన్ని అందుకున్న లోకేశ్ కనగరాజ్, ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. యాక్షన్ కి ఎమోషన్ ను తోడుగా చేసి కథను ఆసక్తికరంగా నడిపించడంలో లోకేశ్ కనగరాజ్ సిద్ధహస్తుడు. స్క్రీన్ ప్లే పై ఆయనకి మంచి పట్టుంది. ఏ పాత్ర ఎక్కడ ఎలా ఎంట్రీ ఇవ్వాలో .. ఏ సీన్ ఎక్కడ ఎలా పడాలో .. పండాలో ఆయనకి బాగా తెలుసు. అందువలన ‘మాస్టర్’ విజయ్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలవడం ఖాయమనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ల నమ్మకాన్ని అలా ఉంచితే, ఈ రోజు సాయంత్రం పలకరించనున్న టీజర్ ఈ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు పెంచుతుందో చూడాలి.











