ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థకు చెందిన డెలివరీ బాయ్స్ పెద్ద ఎత్తున కాకతీయ హిల్స్ గ్రౌండ్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. డెలివరీ చేసినందుకు అధిక మొత్తం ఇవ్వాలని వారంతా కలిసి వినూత్నంగా మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. యాజమాన్యం తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. గత ఎనిమిది రోజులుగా హైదరాబాద్ లో ఈ ఆందోళన కార్యక్రమాలను వివిధ రూపాల్లో చేపడుతున్నారు.
ఇక అసలు విషయానికొస్తే…నగర వ్యాప్తంగా ఫుడ్ సరఫరా చేసే సంస్థ స్విగ్గీ డెలివరీ బాయ్స్ గత కొన్ని రోజులుగా నిరసన బాటపట్టారు. గత ఎనిమిది రోజులుగా ఏదోక పద్ధతిలో తమ డిమాండ్ల సాధనకు నిరసనలో పాల్గొంటున్నారు. స్విగ్గీ కంపెనీలో నగర వ్యాప్తంగా డెలివరీ ఎగ్జిక్యూటివ్ వేల మంది పని చేస్తున్నారు. వీరికి గతంలో నాలుగు కిలో మీటర్ల పరిధిలోపు ఒక డెలివరీ ఐటమ్‌కు రూ.35 కమీషన్ వచ్చేదట. కానీ, ప్రస్తుతం ఒక కిలోమీటర్ పరిధిలోపు డెలివరీ చేస్తే కేవలం రూ.6 మాత్రమే కమీషన్ వస్తోందని డెలివరీ బాయ్స్ ఆందోళన బాటపట్టారు. తమ కష్టానికి తగ్గట్లుగా కమిషన్ ఇవ్వడం లేదనేది వారి ఆరోపణ.
నగరంలో ఫుడ్ డెలివరీ సంస్థలు ఎన్నో పుట్టుకొస్తున్నాయి. చాలా మంది యువత వీటిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. జనం కూడా తమకు నచ్చిన రెస్టారెంట్ల నుంచి ఫుడ్ తెచ్చుకునేందుకు ఇలాంటి ఫుడ్ డెలివరీ సంస్థలను ఉపయోగించుకుంటున్నాయి. అయితే కరోనా ముందు వరకు ఈ డెలిరీ సంస్థలు బాగా లాభాల్లోకే నడిచేవి. కానీ లాక్ డౌన్, కరోనా వ్యాప్తి కారణంగా ఒక్కసారిగా పరిస్థితి అంతా మారిపోయింది. ఈ క్రమంలో వాటిపైనే అధారపడి జీవనం సాగిస్తున్న డెలివరీ బాయ్స్‌కు కూడా కష్టాలు తప్పలేదు. అన్ లాక్ తరువాత కొన్ని సడలింపులతో కొన్ని రెస్టారెంట్లు మళ్లీ తెరుచుకోవడంతో రెస్టారెంట్ల నుంచి ఫుడ్ డెలివరీ చేసుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరిగింది. కానీ గతంలో డెలివరీ బాయ్స్‌కు ఏదైతే ఇచ్చేవారో నాలుగు కిలోమీటర్ల పరిధిలోపు ఒక డెలివరీ ఐటమ్‌కు రూ.35 కమీషన్ కు బదులు రూ.6 మాత్రమే ఇస్తున్నారని ఆందోళన చేస్తున్నారు.
డెలివరీ బాయ్స్‌కు గతంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం వచ్చేది. ఇప్పుడు తగ్గించిన కమీషన్లతో రూ.10 వేలు కూడా రావడం కష్టంగా ఉందని చెబుతున్నారు. రోజంతా కష్టపడినా రూ.400లు కంటే ఎక్కువ రావట్లేదని, ఇందులో రూ.200 వరకూ పెట్రోల్ ఖర్చుకే పోతుందంటున్నారు. కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా యాజమాన్యం ఎలాంటి హామీ ఇవ్వలేదని బాయ్స్ ఆందోళన చేస్తున్నారు. తమను మోసం చేస్తున్న కంపెనీపై కార్మిక చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఐటీ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌కు వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు.
మినిమమ్ ఆర్డర్ చేసే బిల్‌పై రూ. 35లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. బ్యాచ్ ఆర్డర్ బిల్స్ మీద రూ.20 కమీషన్ ఇవ్వాలని బాయ్స్ కోరుతున్నారు. ఒక కిలోమీటర్ ఆర్డర్‌కు రూ.10, 6 కిలో మీటర్ల నుంచి 8 కిలోమీటర్లలోపు వరకు రూ.25 చెల్లించాలని యాజమాన్యానికి డిమాండ్ చేస్తున్నారు. 8 కిలోమీటర్ల పైన ఉంటే కిలోమీటరుకు రూ.35లు చెల్లించాలి











