కరోనా రావడంతో ప్రయివేటు పాఠశాలలకు ఏప్రిల్ నుంచే జీతాలు చెల్లించడం లేదు. ఇక ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం అయినా ఉపాధ్యాయులతో పనిలేకుండా పోయింది. విజయవాడలో వంద మంది ఉపాధ్యాయులు ఉన్న ఓ పేరున్న విద్యాసంస్థ 12 మంది ఉపాధ్యాలతో ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. గతంలో క్లాసుకు 35 నుంచి 40 మంది విద్యార్ధులు ఉండేవారు. నేడు ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం కావడంతో పదో తరగతిలో 400 మంది ఉన్నా ఒక్కో సబ్జెక్టుకు ఒక టీచర్ సరిపోతున్నారు. దీంతో ప్రయివేటు ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారు. ప్రయివేటు విద్యాసంస్థల దోపిడీ మాత్రం మరింత పెరిగింది.
తల్లిదండ్రులకు మరింత భారం
విద్యార్ధుల తల్లిదండ్రులకు ఆన్ లైన్ క్లాసులు పెనుభారంగా మారాయి. ఇద్దరు పిల్లలు ఉంటే రెండు ల్యాప్ టాప్ లు, లేదా రెండు కంప్యూటర్లు కొనాల్సి వస్తోంది. ఒక్కో విద్యార్ధికి ఇలా రూ.25 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అలాగని ప్రయివేటు విద్యాసంస్థలు ఫీజులు తగ్గించుకుంటున్నాయా అంటే అదీ లేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు భారీగా చేరుతున్నారు.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 9, 10 తరగతులతోపాటు ఇంటర్మీడియట్ విద్యార్ధులకు కాలేజీలు ప్రారంభం అయ్యాయి. దీంతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరి వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రయివేటు దోపిడీ భరించలేక, కంప్యూటర్లు కొనలేక చాలా మంది పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలు, కాలేజీలకు పంపిస్తున్నారు.
ఆడింది ఆట పాడింది పాట
ప్రయివేటు విద్యాసంస్థల ఫీజుల నియంత్రణలో తెలుగు రాష్ట్రాలు విఫలం అయ్యాయి. ఓ మాదిరి ప్రయివేటు పాఠశాలకు సంవత్సరానికి రూ.40 వేల నుంచి రూ.60 వేల దాకా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇక పాఠశాల పేరులో ఇంటర్నేషనల్ స్కూల్ అని పేరుంటే లక్షల్లో ఫీజులు చెల్లించుకోవాల్సిందే. విజయవాడలో గత ఏడాది ప్రారంభమైన ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో చేరాలంటే ఏటా రూ.3 నుంచి 4 లక్షలు చెల్లించుకోవాల్సిందే.
కరోనా కారణంగా ప్రయివేటు విద్యాసంస్థలు మొదట్లో ఆందోళన చెందినా ఆన్ లైన్ క్లాసులు అందుబాటులోకి రావడంతో ఇక వారి ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. వందలాది టీచర్లకు జీతాలు ఇచ్చే పనిలేదు. పట్టుమని పది మంది టీచర్లు ఉంటే చాలు 300 మందికి విద్యాబోధన చేస్తున్నారు. దీంతో ప్రయివేటు విద్యాసంస్థల ఖర్చులు తగ్గిపోయి భారీగా దండుకుంటున్నారు.
విద్యార్ధుల పరిస్థితి అగమ్య గోచరం…
ఆన్ లైన్ క్లాసుల ద్వారా విద్యార్ధులకు ఎంత వరకు అర్థం అవుతుందో అంతుపట్టడం లేదు. ఇక ప్రయివేటు విద్యాసంస్థలు ఆన్ లైన్ లో వారాంతపు టెస్టులు పెట్టి మార్కులు కూడా భారీగానే వేస్తున్నారు.
తరగతి గదిలో విద్యార్ధులకు అనుమానం వస్తే ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకునే వెసులుబాటు ఉండేది. నేడు ఆ పరిస్థితి లేదు. క్లాసు అయిపోయాక వారు ఏర్పాటు చేసి వాట్సాప్ గ్రూపులో విద్యార్ధుల అనుమానాలను మెసేజ్ ద్వారా అడగాల్సి ఉంటుంది. దీని ద్వారా చాలా మంది విద్యార్ధులు తమకు వచ్చిన అనుమానాలను తీర్చుకోలేకపోతున్నారు. ఆన్ లైన్ విద్యాబోధన గురు శిష్యుల మధ్య ఉండాల్సిన సంబంధాలకు బ్రేక్ వేసింది. ఏదో సినిమా చూసినట్టు, సీరియల్ చూసినట్టు ఆన్ లైన్ విద్యాబోధన సాగుతోంది. ఆన్ లైన్ విద్యాబోధన ఎంత వరకు విద్యార్ధులకు ఉపయోగపడుతుందో పరిశీలన చేయాల్సి అవసరం ఉంది.











